ఈ నోము నోచుకోవాలనుకున్న వారు కాస్త పెద్దదిగా వున్న ఆరోగ్యకరమైన నిమ్మవేరును సంపాదించి దానిపై చిన్నపాటి 'గౌరీదేవి'ప్రతిమను చెక్కించాలి. మాఘ శుద్ధ సప్తమి (రథ సప్తమి) రోజున పూజా మందిరంలో ఆ ప్రతిమను ఉంచి పూజించాలి. ధూప ... దీపాలు సమర్పించుకుని పంచదార గానీ, బెల్లం గాని నైవేద్యం పెట్టాలి. ప్రతిరోజు కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవాలి. ఇలా ఏడాది పూర్తయిన తరువాత ముగ్గురు పేరంటాళ్లను పిలిచి పూలు ... పండ్లు ... కొత్త వస్త్రాలు ... నల్ల పూసలు ... లక్క జోళ్లు ... ఐదు నిమ్మ పళ్ళను దక్షిణ తాంబూలాలతో పాటు వాయనమిచ్చి ఉద్యాపన చెప్పుకోవాలి.
ఇక ఈ వ్రతానికి కారణమైన కథను గురించి తెలుసుకుందాం. పూర్వం ఓ గ్రామంలో పద్మగంధి - పద్మనాభుడు అనే దంపతులు వుండేవారు. ధన ధాన్యాల విషయంలో వారికి ఎలాంటి లోటూ లేదు. అయితే సంతానం లేకపోవడం వారిని మానసికంగా కుంగదీస్తూ వస్తోంది. దాంతో ఇరుగు పొరుగు వారి మాటలు నమ్మి వారు ఎన్నో తీర్థ యాత్రలు చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆ దంపతులు మరింత దిగాలు పడిపోయారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామానికి వచ్చిన ఓ మహర్షిని వాళ్లు కలుసుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. దాంతో ఆ మహర్షి 'నిమ్మలగౌరీ నోము' నోచుకోమంటూ దాని విధి విధానాలను వారికి వివరించాడు. ఆయన చెప్పినట్టుగానే చేసిన ఆ దంపతులకి, కొంత కాలానికి సంతానం కలగడంతో వారి ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఆ రోజు నుంచి ఆ దంపతులు ఈ వ్రతానికి మరింత ప్రచారం కల్పించి, మరెంతో మంది సుఖ సంతోషాలకు కారకులయ్యారు.