ప్రాచీన కాలం నాటి మాట . ఆ రోజులలో ఒక రాజ్యం. ఆ రాజ్యమును ఒక రాజు పాలించే వాడు. ఆయనకు జగదీశ్వరి పట్టపురాణి . ఆమె భక్తురాలు ,నిరంతరం భగవదానుగ్రహం కోసం దేవారాధనతో గడిపేది ,పరమ పతివ్రత . సాద్వీ మణి గుణవంతురాలు .శీలవతి .అన్ని ఎందుకు సద్గుణ వతి. ఆమె ప్రతి ఏటా మూల గౌరీ నోము నోచేది. గౌరీ దేవి అనుగ్రహం కోసం అయిదవ తనం నిలుపు కుందుకు అ చల్లని తల్లి పూజలు చేసేది. భక్తి శ్రద్దలతో వ్రత మాచరించేది.
కాలం గడుస్తోంది .శత్రు రాజులు దండెత్తారు .వారి బలం ముందు తన భర్త పడిపోయాడు. అంతేకాదు చనిపోయాడు. సైన్యం మరణించారు. అంత మహారాణి విషయాలు అన్నీ తెలుసుకుని సైనికుల , భర్త ప్రాణాలు గొనిపోయె యమ భటుల నుద్దేశించి -
"ఓ యమకింకరులారా ! ఆగండి ,ఆగండి .నాపలుకులు వినండి . నేను మూల గౌరీ వ్రతం ఆచరించాను . ఆ వ్రత ఫలంగా నా మాంగల్యానికి భంగం రారాదు .నా ప్రజలు సైనికులు సుఖంగా ఉండాలి .నా రాజ్య మందు ఎవరికీ ఏ హాని కలుగరాదు. సుఖంగా ఉండాలి. " అని బిగ్గరగా అరచింది. ఆ అరుపులు విని యమభటులు భయపడి పోయి పారిపోయారు. రాజు సైనికులు తిరిగి ప్రాణాలతో లేచి కూర్చున్నారు. యుద్ధం చేశారు . శత్రువులను ఓడించారు .సుఖంగా జీవించారు . ఇదంతా మహారాణి చేసిన వ్రత ఫలం .
ఇక ఉద్యాపన వినండి. కధ చదువుకుని పవిత్రాక్షతలు శిరస్సున చల్లుకొనవలెను. ఒక సంవత్సరం పూర్తికాగానే ఒక పెరంటాలిని పిలిచి పిండి వంటలతో భోజనం పెట్టవలెను. పండ్లు, కొత్త బట్టలు , పసుపు ,కుంకుమ , నవరత్నాభరణములు ,దక్షిణ ,తాంబూలం సిద్దం చేసుకుని వాయన మందీయ వలెను. శ్రద్దా భక్తులతో నోము నోచిన ఫలం సిద్దించ గలదు.