హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Saturday, September 06, 2014

మునికార్తీక వ్రతము

ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.

ఒక బ్రాహ్మణి కడు పేదయై, దానిని భరించలేక బ్రహ్మ లోకమునకు వెళ్ళి వరము తెచ్చుకొనవలెనని ప్రయాణమై వెళ్ళుచుండెను. దారిలో ఒక బ్రహ్మణుడు కనిపించి, తన గతి బ్రహ్మతో చెప్పవలెనని ఆమెను కోరెను. అట్లే యని కొంతదూరము వెళ్ళగా, నక్కడ ఒక ముంతమామిడి చెట్టు కనిపించెను. తన ఫలము లెవరూ తినకుండుటకు కారణము బ్రహ్మనడుగుమని ఆమెను కోరెను. సరేనని ఆమె కొంతదూరము వెళ్ళగా నక్కడ ఒక మల్లె పొద విరబూచి యుండి, తన పూవులు ఎవ్వరూ ముట్టకుండుటకు కారణమడిగి రమ్మని కోరెను.ఆమె యట్లే యని కొంచెము దూరము నడువగా నొక దండెముపై బట్టలు తగులబడుచుండెను. ఇంక కొంతదూరములో నొక అట్లపెనెము చిటపటలాడు చుండెను.

అవన్నీ చూచిన తరువాత నామె బ్రహ్మ కెదురుగా వెళ్ళి నమస్కరించి, తన దరిద్రమునకు కారణము తెలుపమని కోరెను. అంత నా పరబ్రహ్మ "యువతీ! నీవు ముని కార్తిక దీపముల వ్రతము నోచి వుల్లంఘన చేయుటచే నీకిట్టి దరిద్రము గర్భశోకము ప్రాప్తించెను. ఇప్పుడు నీవు యింటికివెళ్ళి మూడుకార్తులు ముని కార్తీక దీపములను వెలిగించుకొని, సుఖముగా నుండు" మని చెప్పెను.

పిమ్మట నాపుణ్యవతి "స్వామీ! నేను దారిలో చూచిన వింతలకు కారణమేమి" అని యడిగెను. అప్పుడు బ్రహ్మ "అమ్మా! నీవు చూచిన బ్రాహ్మణుడు పూర్వజన్మయందు సర్వ విద్యలను నేర్చి, ఒకనికైనా విద్యచెప్పలేదు. అందుకే అతనికి ఆ గతి పట్టెను. కావున నీవువెళ్ళునప్పుడు నతనికి "రామ" అని చెప్పి వెళ్ళిపొమ్ము అతనికి దోషము తొలగును. నీవు చూచిన ముంతమామిడి పూర్వమొక స్త్రీ. ఆమెకు పది మంది పిల్లలున్నప్పుడు పెంచుకొనుటకు బిడ్డనివ్వమని అడుగగా ఆమె యివ్వలేదు. వారి వుసురు తగలి వంశనాశనమై పోయి, చివరికి మామిడిచెట్టుగా మారినది. నీవు వెళ్ళు నప్పుడు నొక మామిడిపండు తినుము. తరువాత నందరూ ఆ పండు కోయుదురు. అప్పుడామెకు శాంతి లభించును. తరువాత నీవు చూచిన మల్లెపొద పూర్వమొక భోగము స్త్రీ. ఆమె పువ్వులు తెచ్చుకొని ఎవ్వరికీ ఒక్క పువ్వయిననూ యిచ్చెడిది కాదు. అందుచే ఆమె యిప్పుడట్లున్నది. నీవు పోవుచు నొక పువ్వు కోసుకొనుము. ఆమె దోషము పోవును.

అటుపైన నీవు చూచిన పైన మంటలు, కోకలు తగులబడిపోవుట వలన కల్గినది. పూర్వము కొందరు యేడు తరముల తరబడి పుట్టింట ఆడపడుచులకు బట్ట పెట్టలేదు. అందుకే వారి బట్టలు తగులబడుచున్నవి. నీవొక కోక తీసుకొని వారి దోషమును హరింపుము. ఇంకనూ నీవు చూచిన పెనములు పూర్వము అత్తాకోడండ్రు. వారిద్దరూ యెదురు వాయనాలందుకొన్నారు. అందుచే నిప్పుడట్లు చిటపట లాడుచున్నారు. నీవా పెనముల మీద నీళ్ళు చల్లినచో వారు శాంతి నొందుదురు. ఇన్ని చేసినందుకు నీకు ఫలితముగా వత్తి చేసి మొక్కిన ఫలమిచ్చితిని" పొమ్మనెను. అంత నామె వినయముతో బ్రహ్మకు నమస్కరించి, బ్రహ్మలోకము నుంచి వచ్చుచూ దారిలో బ్రహ్మ చెప్పినట్లు ఇంటికి వెళ్ళి శివరాత్రి నాడు నోము పట్టి మూడువందల అరువది వత్తులను వెలిగించి ఉద్యాపనమును చేసుకొని సుఖముగా నుండెను.
దీనికి వుద్యాపనము
కొత్త అంగ వస్త్రము పరచి, దానిమీద ఐదు మానికల బియ్యంతో మండపమేర్పరచి, దక్షిణ తాంబూలాదులు పెట్టి వెండి ప్రమిదెలో బమిడి వత్తి వెలిగించి బ్రాహ్మణునకు ఇవ్వవలెను.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...