హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Tuesday, June 05, 2012

8.ఐతరేయోపనిషత్

|| ఐతరేయోపనిషత్ ||


ప్రథమ అధ్యాయం - ప్రథమ ఖండం :
1. ఓం!! ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర 
ఆసీన్నాన్యత్ కించన మిషత్ !
స ఈక్షత లోకాన్ను సృజా ఇతి !!
విశ్వం పుట్టకముందు ప్రారంభంలో భగవంతుడు మాత్రమే వున్నాడు. కనురెప్పలల్లార్చే మరేప్రాణీ లేదు. అప్పుడు దేవుడు ‘‘నేను లోకాలను సృష్టిస్తాను’’ అని అనుకున్నాడు. 
2. స ఇమాన్ లోకానసృజత !
అంభో మరీచీర్మరమాపో దో మ్భ: పరేణ 
దివం ద్యౌ: ప్రతిష్టా న్తరిక్షం మరీచయ:!
పృథివీ మరో యా అధస్తాత్తా ఆప: !!
అంభలోకం, స్వర్గలోకం, మరీచిలోకం, మరలోకం, ఆపలోకం అనే లోకాలను భగవంతుడు సృష్టించాడు. అంభలోకం స్వర్గలోకానికి పైనుంది. మరీచిలోకం కాంతిలోకాలతో కూడిన అంతరిక్షం. మరలోకం భూమి. భూమికింద వున్నదే ఆపలోకం. 
3. స ఈక్షతేమే ను లోకా 
లోకపాలాన్ను సృజా ఇతి !
సో ద్భ్య ఏవ పురుషం 
సముద్ధృత్వా మూర్ఛయత్ !!
భగవంతుడు.. ‘‘లోకాలను సృష్టించాను. ఇక లోకరక్షకులను సృష్టిస్తాను’’ అని అనుకున్నాడు. తరువాత నీటినుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. 
4. తమభ్యతపత్తస్యాభి తప్తస్య ముఖం నిరభిద్యత యథాణ్ణమ్!
ముఖాద్ వాక్ వాచో గ్నిర్నిసికే నిరభిద్యేతాం నాసికాభ్యాం ప్రాణ: 
ప్రాణాద్వాయురక్షిణీ నిరభిద్యే తామక్షి భ్యాంచక్షశ్చక్షష ఆదిత్య: 
కర్ణౌ నిరభిద్యేతాం కర్ణాభ్యాం శ్రోత్రం శ్రోత్రాద్ దిశస్త్వజ్ నిరభిద్యత 
త్వచోలోమాని లోమభ్య ఓషధివనస్పతయో హృదయం నిరభిద్యత
హృదయాన్మనో మనసశ్చంద్రమా నాభిర్నభిద్యత 
నాభ్యా అపానో పానా న్మృత్యు: 
శిశ్నం నిరభిద్యత శిశ్నాద్రేతే రేతస ఆప: !!
బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన తరువాత భగవంతుడికి అతని గురించి చింతన చేశాడు. అప్పుడు నోరు, ముక్కు, గ్రుడ్డు పగిలినట్లు విచ్చుకున్నాయి. 
నోటినుంచి వాక్కు(మాట) వెలువడింది. వాక్కునుండి అగ్ని వచ్చింది. 
ముక్కు ఉద్భవమయింది. ముక్కుపగిలి నాసికాపుటల నుండి శ్వాస వచ్చింది. శ్వాసనుండి వాయువు ఉత్పన్నమయింది. 
కళ్లు పుట్టుకొచ్చాయి. వాటినుండి చూపు వచ్చింది. చూపు నుండి సూర్యుడు ఉద్భవించాడు. 
చెవులు పుట్టుకొచ్చాయి. అవి విచ్చుకుని శబ్దగ్రహణ శక్తి చేకూరింది. దానినుండి దిశలు పుట్టుకొచ్చాయి. 
చర్మం పుట్టుకొచ్చింది. చర్మం విచ్చుకుని వెంట్రుకలు, వెంట్రుకల నుండి చెట్లు ఉత్పన్నమయ్యాయి. 
హృదయం ఆవిర్భవించింది. హృదయం విచ్చుకుని మనస్సు, మసస్సు నుండి చంద్రుడు పుట్టుకొచ్చారు. 
బొడ్డు పుట్టింది. బొడ్డునుండి అపానము, అపానం నుండి మృత్యువు ఉత్పన్నమయ్యాయి. 
జననేంద్రియం పుట్టింది. జననేంద్రియం విచ్చుకుని రేతస్సు, రేతస్సు నుండి నీరు ఉత్పన్నమయ్యాయి. 
ప్రథమ అధ్యాయం - ద్వితీయ ఖండం :
1. తా ఏతా దేవాతా: సృష్టా అసిన్మహత్యర్ణవే ప్రాపతన్ !
తమశనాయా పిపాసాభ్యామ్ అన్యవార్జత్ !
తా ఏనమబ్రువన్నాయతనం న: 
ప్రజానీహియస్మిన్ ప్రతిష్టితా అన్నమదామేతి!!
పైవిధంగా సృష్టించబడ్డ దేవతలు, ప్రాణులు ఈ మహాసముద్రంలో పడ్డారు. బ్రహ్మదేవుడు వారికి ఆకలిదప్పులను కలుగచేశాడు. మేం వుండి ఆహారం తినడానికి ఓ చోటు చూపించండిఅని వారు బ్రహ్మదేవుడ్ని కోరారు. 
2. తాభ్యో గామానయత్ తా అబ్రువన్నవైనోయమలమితి!
తాభ్యో శ్వమానయత్తా అబ్రువన్నవైనో యమలమితి!!
బ్రహ్మదేవుడు మొదటగా వారికి ఒక గోవును తెచ్చి ఇచ్చాడు. ఆ తర్వాత గుర్రాన్ని కూడా ఇచ్చాడు. కాని వారు ‘‘ఇది మాకు చాలదు’’ అని బదులిచ్చారు. 
3. తాభ్య: పురుషమానయత్ తా అబ్రువన్ 
సుకృతం బతేతి పురుషో వాన సుకృతమ్ !
తా అబ్రవీద్ యథాయతనం ప్రవిశతేతి !!
ఆ తరువాత బ్రహ్మదేవుడు వారికి ఒక మనిషిని తెచ్చిచ్చాడు. ‘‘ఆహా! ఇతడు మనిషి, నిశ్చయంగా ఇతడు చక్కగా సృష్టించబడ్డాడు’’ అని వారన్నారు. వారితో బ్రహ్మదేవుడు ‘‘మీమీ సముచిత స్థానాల్లో ప్రవేశించండి’’ అని చెప్పాడు. 
4. అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశ్వద్వాయు: 
ప్రాణో భూత్వా నాసికే ప్రావిశత్ ఆది 
త్యాశ్చక్షుర్భూత్వా అక్షిణీ ప్రావిశత్ దిశ: 
శ్రోత్రం భూత్వా కర్ణౌ ప్రావిశన్ ఓషధివన
సృతయో లోమాని భూత్వా త్వచం 
ప్రావిశంచ్చన్ద్రమా మనో భూత్వా హృదయం 
ప్రావిశన్మృత్యురపానో భూత్వా నాభిం 
ప్రావిశదాపోరేతో భూత్వా శిశ్నం ప్రావిశన్ !!
అగ్ని వాక్కుగా మారి నోటిలో ప్రవేశించింది. 
వాయువు ప్రాణమై ముక్కులో ప్రవేశించింది. 
సూర్యుడు చూపుగా మారి కళ్లలో ప్రవేశించాడు. 
దిక్కులు శబ్దగ్రహణ శక్తియై చెవులలో ప్రవేశించాయి. 
మూలికలు, చెట్టుచేమలు వెంట్రుకలై చర్మంలో ప్రవేశించాయి. 
చంద్రుడు మనస్సై హృదయంలో ప్రవేశించాడు. 
మృత్యువు అపానమై బొడ్డులో ప్రవేశించింది. 
నీరు రేతస్సుగా మారి పురుష జనననేంద్రియంలో ప్రవేశించింది. 
5. తమశనాయాపిపాసే అబ్రుతామావాభ్యామ్ అభిప్రజానీహీతి!
తే అబ్రవీదేతాస్వేవవాం దేవతాసు అభజామి ఏతాసు భాగిన్యౌ కరోమీతి!
తస్మాత్ యస్వై కస్యై చ దేవాతాయై హవిర్గృహ్యతే 
భాగిన్యావేవ అస్యామ్ అశనాయాపిపాసే భవత: !!
ఆకలి దప్పికలు బ్రహ్మదేవుని సమీపించి.. ‘‘మేం ఇద్దరం నివసించడానికి ఒక స్థలాన్ని కేటాయించండి’’ అని కోరాయి. అందుకు ఆయన ‘‘ఈ దేవతల వద్దే మీకు ఆవాసం కల్పిస్తున్నాను. వారి ఆహారంలో భాగస్వాములుగా మిమ్మల్ని చేస్తున్నాను’’ అని చెప్పాడు. అందువల్ల ఏ దేవతకు నైవేద్యం అర్పించినా.. ఆకలి దప్పులు వాటిలో పాలుపంచుకుంటాయి. 
(ఇది ప్రథమ అధ్యాయంలోని ద్వితీయ ఖండం)
ప్రథమ అధ్యాయం - తృతీయఖండం 
ఆహార సృష్టి : 
1. స ఈక్షతేమేను లోకాశ్చ లోకపాలశ్చ అన్నమేభ్య: సృజా ఇతి: 
భగవంతుడు.. ‘‘లోకాలను, వాటి పాలకులనూ సృష్టించాను. ఇక వీరికి ఆహారాన్ని సృష్టిస్తాను’’ అని సంకల్పించాడు. 
2. సో పో భ్యతపత్ తాభ్యో భితప్తాభ్యో మూర్తిరజాయత 
యా వై సా మూర్తిరజాయతాన్నం వై తత్ !!
భగవంతుడు బలం గురించి ఆలోచన చేశాడు. జలంలో నుండి ఒక ఆకృతి వెలువరించేటట్లు చేశాడు. అదే ఆహారం. 
3. తదేతదభిసృష్టం పరాఙత్యజిఘాంసత్ !
తద్యాచాజిఘృక్షత్ తన్నాశక్నోద్వాచా గ్రహీతుమ్ !
స యద్ధైనద్వాచా గ్రహైషయద్ అభివ్యాహృత్య హైవాన్నమ్ అత్రప్స్యత్ !!
అలా భగవంతుడు సృష్టించిన ఆహారం పరుగులు తీయడం మొదలుపెట్టింది. మనిషి దాన్ని వాక్కుతో పట్టుకోవడానికి ప్రయత్నించాడు. సాధ్యం కాలేదు. కాని వాక్కుతో పట్టుకోగలిగితే ఆహారం అని చెప్పడంతోనే తృప్తి చెందేవాడు. 
4. తత్ ప్రాణేనాజిఘృక్షత్ తన్నాశక్నోత్ ప్రాణేన గృహీతుమ్ !
స యుద్ధైనత్ ప్రాణేనాగ్రహైష్యద్ అభిప్రాణ్య హైవాన్నమ్ అత్రప్స్యత్ !!
పరుగెత్తి పోవాలని ప్రయత్నించిన ఆహారాన్ని మనిషి శ్వాసతో పట్టుకోబోయాడు. శ్వాసతో పట్టుకోవడం సాధ్యమైతే ఆఘ్రాణించి తృప్తిచెందేవాడు. 
5. తచ్చక్షుషా జిఘృక్షత్ తన్నాశక్నోచ్ఛక్షుషా గ్రహీతుమ్ !
స యద్ధైనత్ చక్షుషా అగ్రహైష్యద్ దృష్ట్యా హైవాన్నమ్ అత్రప్స్యత్ !!
అలాగే.. పరుగెత్తి పోవాలని ప్రయత్నించిన ఆహారాన్ని చూపుతో పట్టుకోబోయాడు. కాని వీలు కాలేదు. అదే సాధ్యమైతే ఆహారాన్ని చూసే తృప్తి చెందేవాడు. 
6. తచ్ర్ఛోత్రేణాజిఘృక్షత్ తన్నాశక్నోచ్ర్ఛోత్రేణ గ్రహీతుమ్ !
స యద్ధైనత్ చ్ఛోత్రేణ అగ్రహైష్యత్ శ్రుత్వా హైవాన్నమ్ అత్రప్స్యత్ !!
పరుగెత్తి పోవాలని ప్రయత్నించిన ఆహారాన్ని వినికిడితో పట్టుకోబోయాడు. కాని అలా కూడా సాధ్యం కాలేదు. అదే సాధ్యమైతే ఆహారం గురించి విని తృప్తి చెందేవాడు. 
7. తత్ త్వచాజిఘృక్షత్ తన్నాశక్నోత్వచా గ్రహీతుమ్!
స యద్ధైనత్ త్వచా గ్రహైష్యత్ స్పృష్ట్యా హౌవన్నమ్ అత్రప్స్యత్ !!
పరుగెత్తి పోవాలని ప్రయత్నించిన ఆహారాన్ని స్పర్శతో పట్టుకోబోయాడు కాని వీలు కాలేదు. అదే సాధ్యమైతే ఆహారాన్ని కేవలం ముట్టుకుని తృప్తి చెందేవాడు. 
8. తన్మనసాజిఘృక్షత్ తన్నాశక్నోన్మనసా గ్రహీతుమ్ !
స యద్ధైనన్మసా గ్రహైష్యత్ ధ్యాత్వా హైవాన్నమ్ అత్రప్స్యత్ !!
పరుగెత్తి పోవాలని ప్రయత్నించిన ఆహారాన్ని మనస్సుతో పట్టుకోబోయాడు కాని వీలుకాలేదు. అదే సాధ్యమైతే ఆహారం గురించిన భావనతో తృప్తి చెందేవాడు. 
9. తచ్ఛిశ్నేన అజిఘృక్షత్ తన్నాశక్నోత్ శిశ్నేనే గ్రహీతుమ్ !
న యద్ధైనత్ శిశ్నేన గ్రహైష్యత్ విసృస్య హైవాన్నమ్ అత్రప్స్యత్ !!
పరుగెత్తి పోవాలని ప్రయత్నించిన ఆహారాన్ని జననేంద్రియంతో పట్టుకోబోయాడు కాని వీలు కాలేదు. అదే సాధ్యమైతే ఆహారాన్ని విసర్జనక్రియతో తృప్తి చెందేవాడు. 
10. తదపానేనాజిఘృక్షత్ తదావయత్ !
సైషో న్నస్యగ్రహో యుద్వాయు రన్నాయుర్వా ఏష యుద్వాయు: !!
పరుగెత్తి పోవాలని ప్రయత్నించిన ఆహారాన్ని అపానంతో పట్టుకోబోయాడు. అప్పుడు దాన్ని గ్రహింప వీలైంది. కాబట్టి అపానమే ఆహారాన్ని గ్రహించగలదు అని తెలసుకున్నాడు. ఆ అపానమే ఆహారం ద్వారా జీవితాన్ని భరిస్తోంది. 
భగవంతుడు మనిషిలో ప్రవేశించడం : 
11. స ఈక్షత కథం న్విదం మదృతే స్వాదితి !
స ఈక్షత కతరేణ ప్రపద్యా ఇతి !
స ఈక్షత యదివాచా భివ్యాహృతం యది 
ప్రాణేనాభిప్రాణితం యది చక్షుషా దృష్టం 
యది శ్రోత్రేణ శ్రుతం యది త్వచా 
స్పృష్టంయది మనసా ధ్యాతం యద్వపానేనాభ్య 
పానితం యది శిశ్నేన విసృష్ట మథకో హమితి !!
‘‘నేను లేకుండా ఇది ఎలా నిలవగలదు? ఏ మార్గంద్వారా నేను దానిలో ప్రవేశించాలి? వాక్కుతో మాట్లాడటం, శ్వాసతో శ్వాశతీసుకోవడం, చూపుతో చూడటం, వినికిడితో వినడం, స్పర్శతో స్పృశించడం, మనస్సుతో ఆలోచించడం, అపానంతో జీర్ణించుకోవడం, జననేంద్రియంతో విసర్జనక్రియ సల్పడం సాధ్యపడితే ఇక నేనెందుకు?’’ అని భగవంతుడు అనుకుంటాడు. 
12. స ఏతమేవ సీమానం విదార్యైతయా ద్వారా ప్రాపద్యత ! 
సైషా విదృతిర్నామ ద్వాస్త దేతన్నాన్దనమ్ !
తస్య త్రయ ఆవసథా: త్రయ: స్వప్నా: 
అయమావసథో యమావసథో యమావసథ ఇతి !!
నడినెత్తి చీల్చుకుని, ఆ ద్వారంద్వారా లోపలికి ప్రవేశించాడు భగవంతుడు. ఆ ద్వారం పేరు విదృతి. ఆనందం కొలువైన స్థానం. ఆయనకు స్థానాలు మూడు. కలలు మూడు. ఇది స్థానం. ఇది స్థానం. ఇది స్థానం. 
అనుభూతి : 
13. స జాతో భూతాన్యభివైక్ష్యత్ కిమిహాన్యం వావదిషదితి !
స ఏతమేవ పురుషం బ్రహ్మ తతమమపశ్యత్ ! ఇదమదర్శమితి !!
మనిషిగా జన్మించిన అతడు.. తక్కిన జీవరాసుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆలోచించడానికి వేరే ఏం వుంది. శరీరంలో కొలువైన ఆత్మే సర్వత్రా వ్యాపించి, భగవంతుడిగా వుండడాన్ని అతడు చూశాడు. ‘‘దీనినే నేను కనుగొన్నాను’’ అని ఆశ్చర్యబోతు చెప్పాడు. 
భగవంతుడు అత్యంత సమీపస్తుడు : 
14. తస్మాదిదన్ద్రో నామేదన్ద్రో హ వై నామ !
తమిదన్ద్రం సన్తమిన్ద్ర ఇత్యాచక్షతే పరోక్షేణ !
పరోక్షప్రియా ఇవ హి దేవా: !
పరోక్షప్రియా ఇవ హి దేవా: !!
భగవంతుడు ఇదంద్రుడు అని చెప్పబడుతున్నాడు. నిశ్చయంగా ఇదంద్రుడే. ఎందుకంటే.. ఇదో అని కనిపించేవాడిగా వున్నాడు. ఆయనని ఇదంద్రడని పరోక్షంగా పేర్కొంటున్నారు. ఎందుకంటే దేవతలు పరోక్షంగా వుండడానికే ఇష్టపడతారు. అవును.. దేవతలు పరోక్షంగా వుండానికే ఇష్టపడతారు. 
(ఇది ప్రథమ అధ్యాయంలో తృతీయ ఖండం)
ద్వితీయ అధ్యాయం : 
గర్భధారణ : మొదటి జన్మ 
1. పురుషే హ వా అయామాదితో గర్భో భవతి యధేత ద్రేత: !
తదేతత్వర్యేభ్యో ఙ్గేభ్యస్తేజ: సమ్భూతమ్ ఆత్మన్వేవాత్మానం 
బిభర్తి తద్యదా స్త్రియాం సించతి అథైనజ్జనయతి తదస్య ప్రథమం జన్మ!!
మనిషి ప్రారంభంలో రేతస్సుగా వుంటాడు. రేతస్సు అనేది సమస్త అవయవాల శక్తి సంభూతమై వుంటుంది. ఈ విధంగా తనలో తనను రేతస్సు రూపంలో భరిస్తున్నాడు. రేతస్సును ఎప్పుడు స్త్రీలో ప్రవేశపెడతాడో అప్పుడు తనను శిశువుగా జన్మింపచేసుకుంటాడు. ఇది అతడి మొదటి జన్మ. 

2. తత్ స్త్రియా ఆత్మభూయాం గచ్ఛతి యథా స్వమంగం తథా 
తస్మాదేనాం న హినస్తి సాస్యైతమ్ ఆత్మానమత్ర గతం భావయతి !!
శరీరానికి సొంతమైన ఒక అవయవంగా రేతస్సు స్త్రీతో స్వకీయమైనదిగా అవుతుంది. అందువల్ల అది ఆమె బాధింపదు. రేతస్సుగా తనలో ప్రవేశించిన ప్రాణాన్ని ఆమె గర్భకోశంలో పోషిస్తుంది. 
శిశుజననం : రెండవ జన్మ
3. సా భావయిత్రీ భావయితవ్యా భవతి ! తం స్త్రీ గర్భం బిభర్తి !
సో గ్రే ఏవ కుమారం జన్మనో గ్రే ధిభావయతి ! స యత్ కుమారం జననో 
గ్రే ధి భావయతి ఆత్మాన మేవ తద్భావయతి ఏషాం లోకానాం సన్తత్యా !
ఏవం సన్తతా హిమే లోకాస్తదస్య ద్వితీయం జన్మ !!
గర్భాన్ని సంరక్షించే స్త్రీ సంరక్షించబడాలి. శిశువు జన్మించడానికి ముందు దాని గర్భస్త పిండాన్ని స్త్రీ సంరక్షిస్తుంది. జన్మించిన తరువాత, ఆరంభంలోను ఆ తరువాత కూడా తండ్రి సంరక్షిస్తాడు. ఆ శిశువును తనలాగే సంరక్షిస్తాడు అతడు. ప్రాణుల సంతతి పరంపర కొనసాగడానికి అతడు ఈశిదంగా చేస్తున్నాడు. లోకాలం సంబంధం ఈ విధంగా పెంపొందుతుంది. తల్లి కడుపు నుండి శిశువుగా జన్మించడం మనిషి రెండవ జన్మ. 
మరణం : మూడవ జన్మ :
4. సో స్యాయమాత్మా పుణ్యేభ్య: కర్మభ్య: ప్రతిధీయతే !
అథ అస్య అయమితర ఆత్మా కృతకృత్యో వయోగత: ప్రైతి !
స ఇత: ప్రయన్నేవ పునర్జాయతే తదస్య తృతీయ జన్మ !!
ఈ లోకంలో సత్కర్మలు కొనసాగించడానికి కొడుకు నియమింపబడుతున్నాడు. కాలక్రమేణా చేయవలసిందంతా చేసి తండ్రి వృద్ధుడవుతాడు. ఈ దేహం నుండి బయటపడి, మళ్లీ జన్మిస్తున్నాడు. ఇది అతడి మూడవ జన్మ. 
గర్భకోసం లోపల : 
5. గర్భే ను సన్నన్వేషామ్ అవేదమహం దేవానాం జనిమాని విశ్వాశతం 
మా పుర ఆయసీ రరక్షన్నధ: శ్యేనో జవసా నిరదీయమితి !
గర్భఏవైతత్ శయానో వామదేవ ఏవమువాచ !!
గర్భకోశం లోపల జరిగే విషయాలు ఋషిచే చెప్పబడ్డాయి. ‘‘గర్భంలో వున్నప్పుడే నేను దేవతల జన్మలన్నింటిని తెలుసుకున్నాను. నూరు ఇనుపకోటలు నన్ను రక్షించాయి. ఒక డేగలాగా నేను వేగంగా బయటకు వచ్చాను’’. 

6. స ఏవం విద్వాన్ అస్మాత్ శరీరభేదాదూర్థ్వ ఉత్ర్కమ్యాముష్మిన్ 
స్వర్గే లోకే సర్వాన్ కామానాప్త్వా మృత: సమభవత్ సమభవత్ !!
వామదేవఋషి ఈ సత్యాలను తెలుసుకుని శరీరం నశించగానే బయటకు వచ్చి స్వర్గానికి వెళ్లాడు. అక్కడ సమస్త కోరికలు నెరవేరి, అమరత్వ స్థితిని పొందాడు. 
(ఇది ద్వితీయ అధ్యాయం)
తృతీయ అధ్యాయం :
ప్రాణం - ఆత్మా :
1. ఓం కోయమాత్మేతి వయముపాస్మహే కతర: స ఆత్మా యేన వా పశ్యతి 
యేన వా శృనోతి వా గన్ధానాజిఘ్రతి యేన వ వాచం 
వ్యాకరోతి యేన వా స్వాదుచాస్వాదు చ విజానాతి !!
ఈ ఆత్మ అని మనం ఎవరిని ధ్యానిస్తున్నాం? ఈ ఇద్దరిలో ఎవరు ఆత్మ? ఎవరివల్ల చూస్తున్నామో, వింటున్నామో, మాట్లాడుతున్నామో, తీపి చేదు అంటూ రుచులు చూస్తున్నామో ఆయనే ఆత్మ. 
ఆత్మే ఆధారం : 
2. యదేతద్ హృదయం మనశ్చైతత్ ! సంజ్ఞానమాజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం మేధా 
దృష్టర్థృతిర్మతిర్మనీషా జూతి: స్మృతి: సంకల్ప: క్రతురస: కామో వశ ఇతి!
సర్వాణ్యే వైతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవన్తి !!
ఆ ఆత్మే బుద్ధిగాను, మనస్సుగాను అయివుంది. ఎరుక, పాలకనైజం, లౌకిక జ్ఞానం, వివేకం, మేధస్సు, అంతర్దృష్టి, స్థిరత్వం, చింతనాశక్తి, మానసిక స్పష్టత, మనస్తాపం, జ్ఞాపకశక్తి, నిశ్చయబుద్ధి, తీర్మానం, ప్రాణశక్తి, విషయ సుఖవాంఛ అనేవి ఆత్మలో పలురకాలైన పేర్లు. 
ఆత్మే బ్రహ్మ :
3. ఏష బ్రహ్మైష ఇంద్ర ఏష ప్రజాపతిరేతే సర్వే దేవా ఇమాని చ పఞ్చమహాభూతాని 
పృథివీ వాయురాకాశ ఆపో జ్యోతీంషీత్యేతాని ఇమాని చ క్షుద్రమిశ్రాణీవ !
బీజాని ఇతరాణి చేతరాణ చాణ్డజాని చ జారుజాని చ స్వేదజాని చోద్భిజ్జాని చాశ్వా గావ: 
పురుషం హస్తినో యత్కించేదం ప్రాణి జంగమం చ పతత్రి చ మచ్చ స్థావరం సర్వం 
తత్ ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం ప్రజ్ఞానేత్రో లోక: ప్రజ్ఞా ప్రతిష్టా ప్రజ్ఞానం బ్రహ్మ !!
మహాచైతన్య పదార్థమైన ఆత్మే సృష్టికర్తగాను, ఇంద్రుడుగాను, ప్రజాపతిగాను, తక్కిన దేవతలుగాను వుంది. భూమి, వాయువు, ఆకాశం, జలం, అగ్ని అనే ఐదు మౌలిక మూలకాలుగా అదే వుంది. అల్పప్రాణులుగాను, బీజాలుగాను వున్నది అదే. అండాలనుండి పుట్టినవి, గర్భకోశం నుండి పుట్టినవి. సేద్యం నుండి ఉద్భవించినవి, విత్తనాల నుండి మొలకెత్తేవి అన్నీ అదే. 
గుర్రాలు, గోవులు, మనుష్యులు, ఏనుగులు - ఇలా వున్న జంతువులన్నీ ఆత్మే. నడిచేవి, ఎగిరేవి, ఇత్యాది అన్ని ప్రాణులు, స్థావర జంగమాలు అన్నీ ఆత్మే. సమస్తం ఆత్మ మార్గదర్శకంలో నడుచుకుంటాయి. అన్ని ఆత్మలో నెలకొని వున్నాయి. లోకమంతా ఆత్మచే నడిపించబడుతోంది. సమస్తానికీ ఆత్మే ఆధారభూతం. మహాచైతన్య పదార్థమైన ఆత్మే బ్రహ్మ. 
అమరత్వ స్థితి : 
4. స ఏతేన ప్రజ్ఞేనాతానాస్మాల్లోకాద్ ఉత్ర్కమ్య అముష్మన్స్ 
స్వర్గే లోకే సర్వాన్ కామానాప్త్యామృత: సమభవత్ సమభవత్ !!
మహాచైతన్య పదార్థమైన ఆత్మను అవగతం చేసుకున్నవాడు... శరీర పతనానంతరం స్వర్గానికి వెళతాడు. సమస్త కోరికలు తీరినవాడై అమరత్వస్థితిని పొందుతాడు. అమరత్వస్థితిన పొందుతాడు. 
(ఇది తృతీయ అధ్యాయం)
linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...