హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

శుక్రవారం, జులై 22, 2022

ఆడి కృత్తిక

23 వ తేదీన ఆడి కృత్తిక
ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజుని ఆడి కృత్తిక అంటారు. ఇది సుబ్రహ్మణ్యునికి అత్యంత ప్రీతికరమైన రోజు  ఈ రోజున సుర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శుచియైన తరువాత చలిమిడితో ( చలిమిడి అంటే బియ్యప్పు పిండిని బెల్లంతో కలిపి ముద్దగా చేయాలి ) ఆవు నేతితో మూడు వత్తుల దీపం శివ కుటుంబం ( శివుడు , పార్వతీ దేవి , వినాయకుడు , సుబ్రహ్మణ్యుడు ) చిత్రపటం ముందు గానీ , శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి చిత్రపటం ముందు గానీ వెలిగించాలి.

ఆ తరువాత చిమ్మిలి ( తెల్ల నువ్వులు బెల్లం కలిపి చేస్తారు ), పచ్చి పాలు , వడపప్పు ( నానబెట్టిన పెసరప్పు ), అరటి పండ్లు , తాంబూలం ఇవన్నీ నివేదించి , సుబ్రహ్మణ్యుని స్తోత్రాలు , సుబ్రహ్మణ్య జన్మ వృతాంతం చదువుకుని , సాయంత్రం వరకూ ఉపవసించి , సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ప్రసాదముగా పిండి దీపము , చిమ్మిలి, వడపప్పు , అరటి పండ్లు స్వీకరించాలి.

ముందు రోజు రాత్రి మరియూ ఆ రోజు రాత్రి కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం వలన సుబ్రహ్మణ్య స్వామి వారి విశేష అనుగ్రహం కలుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మందమతులు , జడులు , మతి స్థిమితం సరిగ్గా లేని పిల్లలకు ఈ పూజ అమృత తుల్యంగా పనిచేస్తుంది. అందరికీ జ్ఞానం కలుగుతుంది. సుబ్రహ్మణ్యుడు ఉత్తమమైన జ్ఞానం కలిగిస్తాడు. ఇది తమిళ నాట ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ. మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రాచుర్యం లేదు.  తమిళనాడుకు సమీపంలో ఉన్న ఊర్లలో మాత్రమే జరుపుతుంటారు

*అసలు ఎందుకు ఈ కృత్తికకు అంత ప్రత్యేకతో తెలుసుకుందాము*

తమిళులకు ఏ మాసమైన పౌర్ణమి రోజుతో మొదలవుతుంది , కనుక ఆషాడ పౌర్ణమి నుండీ వారికి ఆషాడ మాసం ప్రారంభమయ్యిందన్నమాట. మనకు ఆషాడ మాసంలో బహుళ ఏకాదశి నుండీ దక్షిణాయనం ప్రారంభమవుతుంది , అదే తమిళులకు తొలి శుద్ధ ఏకాదశి అన్నమాట. అంతేకాదు దక్షిణాయనం ముఖ్యంగా పితృ దేవతల ఆరాధనకు ప్రీతికరమైనది. 

పార్వతీ దేవి సుబ్రహ్మణ్యుని మాతృకలైన కృత్తికలకు ఏ మాసంలోనైనా కృత్తికా నక్షత్రం రోజున ఎవరైతే  సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధిస్తారో వారికి సుబ్రహ్మణ్యుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ప్రసాదించిందట. అందులోనూ దక్షిణాయనానికి ముందు వచ్చే కృత్తిక గనుక దీనిని ఆది కృత్తిక అనీ , ఆషాడ మాసంలో వచ్చేది కనుక ఆడి కృత్తిక అనీ కూడా అంటుంటారు. అందుకే ఆషాడ ఆడి కృత్తిక సుబ్రహ్మణ్యుని ఆరాధనకు అత్యంత శ్రేయస్కరమైనది. 

వీలైతే ఈ రోజు ఎవరైనా వేదవిధునికి కుదిరితే ( బాల బ్రహ్మచారి అయినా వేదవిధునికి ) షడ్రసోపేతమైన భోజనం పెట్టి , ఎర్రటి పంచ , పైపంచ , శక్తిమేరకు దక్షిణ , తాంబూలం , అరటి పండ్లు , గొడుగు , పాదరక్షలు , రాగి చెంబు ( లేదా పంచపాత్ర ఉద్దరిణ , అర్ఘ్య పాత్ర ) సమర్పించి , తానే సుబ్రహ్మణ్యునిగా భావించి ఆశీర్వచనం తీసుకుంటే కలిగే ఫలితం మాటల్లో వర్ణించలేము.

ఒకవేళ బాల బ్రహ్మచారియైన వెధవిధుడు లేక గృహస్తు అయిన వెధవిధుడు లభించకపోతే మధ్యాహ్న సమయంలో ఎవరికైన ఆకలితో ఉన్నవారికి కడుపు నిండుగా ఆహరం పెట్టినా మంచిదే.

ఒకవేళ అటువంటి వ్యక్తి కూడా లభించకపోతే పశు పక్షాదులకు ఆహరం సమర్పించి సుబ్రహ్మణ్యుని ప్రార్ధించినా ఉత్తమ ఫలితం ఉంటుంది , దీనికి ఒక నిదర్శనం కూడా చెబుతాను చూడండి. 

మా పిన్ని ఇది వరకు తమిళనాడు లోని తిరుప్పూరులో ఉండేవారు , ఒక ఆడి కృత్తిక రోజున ఎవరికైన మధ్యాహ్నం భోజనం పెట్టాలి అనుకుంది , కానీ రెండు రోజుల ముందు నుండీ తీవ్ర జ్వరం కారణంగా ఆడి కృత్తిక రోజున కనీసం లేచి నిలబడే శక్తి కూడా లేక ఎంతో బాధపడుతూ సుబ్రహ్మణ్యుని తలచుకుని దుఃఖిస్తుండగా ఉన్నట్లుంది ఒక నెమలి వచ్చి వాళ్ళ బాల్కనీలో వాలింది. మా పిన్ని సుబ్రహ్మణ్యుడే నెమలి రూపంలో వచ్చాడని ఎంతో సంతోషించింది. నిదానంగా లేచి తన తెచ్చుకున్న బ్రెడ్ నే ఆ నెమలికి పెట్టింది , ఆ నెమలి ఆ బ్రెడ్ తినింది , అప్పుడు మా పిన్ని సుబ్రహ్మణ్యుని స్తోత్రం చదువుతుంటే ఆ నెమలి అలానే కాసేపు బాల్కనీలో కుర్చుని , ఆ స్తోత్ర పారాయణ అయ్యాక కదిలింది. ఇది ప్రత్యాన్యామ పధ్ధతి అయినా భక్తికి భగవంతుడు వశుడే అని చెప్పటానికే ఈ లీల చెప్పాను.

కనుక వీలైన వారందరూ తమ శక్తివంచన లేకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఈ రోజు ఆరాధించండి. 

మరో ముఖ్య విషయం , కొంతమందికి కొన్ని అనుమానాలు వస్తుంటాయి , ఇది మా అత్తగారి ఇంట్లో లేదు కనుక చేయవచ్చా ? ఒకసారి చేసి మధ్యలో ఆపేస్తే ఆ దేవీ , దేవతలకు ఆగ్రహం వస్తుందా ? ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవలసినది ఒక్కటే , ఏ పూజయైన , వ్రతమైనా అందరూ ఆచరించాలనే మన మహర్షులు వాటిని మనకు అందించారు , ఇది వరకు తరాలలో ఎవరైనా ఏదైనా ఆటంకం వలనో , నాస్తికత్వం వలనో పాటించకపోయి ఉండచ్చేమో , మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టడం వలన మంచే జరుగుతుంది.

 *ఓం శరవణభవ ఓం శరవణభవ*

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...