హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

మంగళవారం, మార్చి 22, 2016

శ్రీశైలం

పుణ్యక్షేత్రాలు

శ్రీశైలం:

కర్నూలు జిల్లాలో నల్లమల అడవులు - నల్లమల కొండలు. ప్రకృతి అందాలన్నింటినీ ఈ మహారణ్యంలో దాచుకున్నది. పర్వతారణ్య ప్రాంతంలో శివుడు పదిలంగా సముద్రపు మట్టానికి 458 మీ. ఎత్తున కొండ కొమ్మన వెలసిన, పురాణ ప్రసిద్ధమైన అనాది శివక్షేత్రము. శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి ఆలయం. ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల నుండి బస్సులు నడుస్తూవున్నాయి. కొన్నాళ్ళ క్రిందట వరకు జీర్ణావస్థలోనున్నా ఇటీవల ఆలయం పునరుద్ధరించబడింది. కొండపైకి నేరుగా చక్కటి రోడ్ వేయబడి యాత్రికుల సందర్శనార్ధం బహు రమణీయంగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయ ప్రశస్తి అనేక విధాలుగా పురాణాల్లో సైతం చెప్పబడినది. 

శ్లో || మైనాకం మంధరం మేరుం | శ్రీశైలం గంధమాదనమ్ 
పంచశైలా పఠేన్నిత్యం | మహాపాతక నాశనమ్ || 

అని కేవల స్మరణ మాత్రంగానే మహాపాతకాలను నిర్మూలించ గలదని ప్రతీతి. 

శ్లో || కేదారే హ్యుదకం పీత్వా | వారణాస్యాం మృత స్తథా 
శ్రీశైలే శిఖరం దృష్ట్వా | పునర్జన్మ నవిద్యతే. 

కేదార క్షేత్రంలోని నీటిని ద్రావినా, కాశీలో మరణించినా, శ్రీశైల శిఖరం దర్శించినా పునర్జన్మం లేదు - అని చెప్పబడింది. ఇంతటి మహత్తుగల పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగములలో మొట్ట మొదటిది. 

ముఖ్యమైన ఉత్సవాలు:
మహా శివరాత్రికి, ఉగాదికి, చైత్రమాసంలో జరిగే చండీయాగము, కుంభోత్సవము ప్రధానములు. 

శివరాత్రినాటి రాత్రి స్వామి వారి ఆలయంపైన ఉన్న శిఖర కలశం నుండి నాల్గు వైపుల ఉండేటట్లుగా మూరెడు వెడల్పు గలిగి - 360 మూరల గుడ్డను కడతారు. దీనినే పాగ చుట్టటం అనీ అంటారు - మంగళపాగా అని అంటారు. ఈ వస్త్రాన్ని రోజుకొక మూర చొ || 360 రోజులు నేస్తారని చెప్పుకుంటారు. మంగళ పాగా రాత్రి వేళ లింగోద్భవ సమయానికి కరెక్టుగా ముగుస్తుంది. పాగా చుట్టే మనిషి దిగంబరుడై యుండి ఎవరికీ కానరాకుండా వుంటాడట. తరవాత ఈ మంగళపాగాను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ప్రసాదంగా ఇస్తారు. 

క్షేత్ర వైభవం:
ఇక్కడకు ఇక 3 కి. మీ. దూరంలో కృష్ణా నది ఉత్తార వాహినియై ప్రవహిస్తూ వుంది. దీనిని పాతాళ గంగ అని అంటారు. శ్రీశైల జల విద్యుదుత్పాదక కేంద్రం కట్టిన తరువాత పాతాళ గంగకు వెళ్ళేందుకు గల మెట్లు చాల వరకు నీటిలో మునిగిపోయాయి. అయినా యాత్రికులు పాతాళగంగ - దగ్గరలో వున్న ' లింగాల గట్టు ' వగైరాలను దర్శించుకుని గాని మరలరు. 

ఆలయం చుట్టూ ప్రాకారం గోడలు చాల ఎత్తుగాను వివిధ గోపురాల్తో శోభిల్లుతుంటాయి. ప్రాకారనిర్మాణానికి వినియోగించబడిన రాళ్ళు సుమారు 20 అ. వైశాల్యంలో దీర్ఘ చతురస్రాకారంలో ఉండి వాని మీద చతురంగ బలాల చిత్రాలు, రామాయణ, మహాభారత కథా చిత్రాలు - భక్త చరిత్రలు - భగవల్లీలలు చెక్కబడి విశిష్టంగా గోచరిస్తాయి. మల్లికార్జున స్వామి వారి ఆలయానికి సరిగ్గా వెనుక భాగంలో భ్రమరాంబా అమ్మవారి ఆలయంలోని అమ్మవారి దృష్టి నేరుగా శివలింగముపై ఉండేటట్లుగా నిర్మించబడింది. ఆది శంకరాచార్యులవారు ఆలయమునకు శ్రీ చక్రప్రతిష్ట చేశారని ప్రతీతి. చైత్రమాసంలో ' అంబ తిరునాళ్ళ ' అని గొప్ప ఉత్సవం జరుగుతుంది. 

వెనుక వైపున భ్రమరాంబికాలయంతో పాటు - ఎడమ వైపున పార్వతీదేవి ఆలయం ఉంది. సంక్రాంతికి పార్వతీదేవి కల్యాణోత్సవం, శివరాత్రినాడు శ్రీభ్రమరాంబా కళ్యాణోత్సవం జరుగుతాయి. ఈ రకంగా ఒకే సంవత్సరం రెండు కళ్యాణోత్సవాలు జరిగే విశేషం దేశం మొత్తం మీద శైవ క్షేత్రాల్లో ఇక్కడే.

శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దటమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.

చరిత్ర:
ఇక్ష్వాకులు, పల్లవులు, విస్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, శివాజీ లాంటి ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీమల్లికార్జునుని పవిత్రధామం. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ట కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు,అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు.

వసతి సదుపాయములు:
శ్రీశైలదేవస్థాన సత్రములు. గంగా సదన్, గౌరీ సదన్, శివసదన్ శ్రీ శైలంలో వసతిగా దేవస్థానమువారి సత్రములు, అతి పెద్ద కాటేజీలు, హొటల్స్ కలవు. ఆంద్రదేశములో ఎక్కడా లేని విధంగా కులప్రాతిపదికగా ఎవరికి వారుగా ప్రతి కులపువారికీ ఒక సత్రం నిర్వహింపబడుతున్నది. శివరాత్రి పర్వదినములు, కార్తీకమాసమునందు తప్ప మిగిలిన రోజులలో ఏసత్రములోనైనా ఎవరికైనా వసతి లభించును. ఈ సత్రములే కాక మరికొన్ని కర్ణాటక వారి సత్రముల, ప్రైవేటువారి సత్రములతోనూ శ్రీశైలం భక్తజనులతో కళకళలాడుతుంటుంది. శ్రీశైలం చుట్టు ప్రక్కల దాదాపు అయిదు వందల వరకూ శివలింగాలు ఉంటాయంటారు. పరిసర ప్రాంతాలలో చూడదగిన ప్రదేశాలు, దేవాలయాలు,మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు అనేకాలు కలవు. శ్రీశైలము క్షేత్రములోని దర్శనీయ ప్రదేశాలు.

శ్రీమల్లికార్జునుని దేవాలయము: అభేద్యమైన ప్రాకారము లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ఉంటుంది.

భ్రమరాంబిక అమ్మవారి గుడి.: భ్రమరాంబికా అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో అందమైన శిల్పతోరణాలతో కూడిన స్థంబాలతోనూ అత్యద్భుతంగా ఉండును. ఈ ఆలయము ఆంధ్రదేశములోనే అత్యంత విశిష్టమైన శిల్ప కళ కలిగిన దేవాలయముగా వినుతికెక్కినది. ఈ దేవాలయము నందు గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆన్చి వింటే ఝమ్మనే బ్రమరనాధం వినవస్తుంది.

పంచ పాండవులు దేవాలయాలు: పాండవులు మల్లికార్జునుని దర్శించుకొని వారి పేరున అయిదు దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగమున నిర్మించి శివలింగములను ప్రతిష్టించిరి.

వృద్ద మల్లికార్జున లింగము: ఇది ముడతలు పడిన ముఖంలా ఉన్న శివ లింగం. ఇది చూస్తే అంత అందముగా ఉండదు. బహుశా ముసలితనాన్ని గుర్తు చేస్తుంది! శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలము చాలా ఎత్తులో ఉన్నది, నది మాత్రము క్రింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలము నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చెయ్యాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అని అంటారు .... ఎందు కంటే ఇది అంత లోతులో వుంటుంది గనుక. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది నీటి క్రింద బండలపై నాచు నిలచి సూర్య కిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది. అయితే అందరూ నీటి క్రిందగల దీనిని పచ్చల బండ అని వ్యవహరిస్తారు. 

శ్రీశైలం డాం వద్ద పాతాళ గంగ:
2004 లొ పాతాళగంగ కు వెళ్ళుటకు రోప్ వే ఏర్పాటు చేయబడినది. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. శ్రీశైలం "డాం" దిగువన వున్న కృష్ణా నదినే "పాతాళ గంగ అంటారు"
త్రేతాయుగ కాలం నాటి ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా చూడవలసిన వాటిలో ఒకటి. ఇది ప్రధాన ఆలయానికి కొద్ది దూరంలో ఉంటుంది.

శ్రీశైలం లో కొలువై వున్న సాక్షి గణపతి దేవాలయము:
సాక్షి గణపతి:.ఈ గణపతి ఆలయము ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలములో శివుడిని దర్శించినంత మాత్రముననే కైలాస ప్రవేశానికి అనుమతి లభించదు. మనం శ్రీ శైలానికి వచ్చి నట్లు సాక్ష్యం వుండాలి. అందు చేత ఈ సాక్షి గణపతిని దర్సించు కుంటే మనం శ్రీశైలానికి వచ్చినట్లు ఈ గణపతి సాక్ష్యం చెపుతాడు. అందు చేత శ్రీ శైలానికి వచ్చిన వారందరు తమ రాకకు సాక్షిగా ఈ సాక్షి గణపతిని దర్శించు కుంటారు. అందుకే ఇతనిని సాక్షి గణపతి అంటారు. 
ప్రథాన ఆలయానికి దూరంగా వున్న ఈ ప్రదేశంనుండే శిఖర దర్శనం చేసుకోవాలి
శ్రీశైలం మొత్తం లో ప్రత్యేకమైనది, ఈ శిఖరేశ్వరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు; శ్రీ శైలం వెళ్లె దారిలో మధ్య లో ఒక చిన్న గుట్ట వున్నది. ఇంకా చాల దూరంలో శ్రీ శైలం ఉందనగా దారి మధ్యలో ఈ గుట్ట మీద ఎటువైపుకైనా త్రిప్పగలిగే నంది విగ్రహం వున్నది. దాని తలమీద మన కుడిచేతి బొటన వేలు, చిటికన వెలు వుంచి మధ్యలోనుండి దూరంగా అస్పస్టంగా కనబడుతున్న శ్రీశైల ఆలయ గోపుర శిఖరాన్ని అందులోనుంచి చూడాలి. అలా కనబడితే ఇక పునర్జన్మ వుండదని భక్తుల విశ్వాసము. ఈ సౌకర్యము కాలి నడకన వెళ్లేవారికి, లేదా స్వంత వాహనాలలో వెళ్లె వారికె వున్నది. బస్సులు ఇక్కడ ఆగవు. అందు చేత ఈ విషయము కొంత మందికి తెలియ పోవచ్చును.

శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటికేశ్వరము నకు సమీపాన అందమయిన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉన్నది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండ వాలు నుండి కిందికి పడే సన్నని రెండు జల దారలను పంచ దార అని పాల దార అని అంటారు. ఒక దాని నీరు పంచ దార వలె తియ్యగాను, రెండోదాని లోని నీరు పాల రుచి కలిగి వుంటుంది.

ఆది శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్రదేశం
అధిక కాలము ఈప్రాంతమందు తపమాచరించిన గుర్తుగా ఇక్కడ ఉన్న పెద్ద బండపై శంకరుని యొక్క పాదముద్రలు కలవు.

శివాజీ గొప్ప దుర్గా భక్తుడు. శ్రీశైల దేవాలయమును ఎన్నోసార్లు దండయాత్రలనుండి కాపాడి శ్రీశైలంలో భ్రమరాంబికా అమ్మవారి స్వహస్తాలతో వీరఖడ్గం అందుకొన్న ఘనుడు.అతని పేరున ఇక్కడ ఇంకనూ తుదిమెరుగులు దిద్దుకొనుచూ రెండు అంతస్తులుగా నిర్మింపబడిన శివాజీ సాంస్కృతిక,స్మారక భవనము లో- అతడి జీవిత విశేషాల కథనం మరియు చిత్రాల ప్రదర్శన కొరకు మొదటి అంతస్తునూ, శివాజీ కాంశ్యవిగ్రహము కొరకు రెండవ అంతస్తునూ కేటాయించారు.మూడు రూపాయల నామమాత్రపు రుసుముతో సందర్శకులను అనుమతించుచున్నారు.

శ్రీశైలం-రవాణా సౌకర్యాలు:
రోడ్డు మార్గములు హైదరాబాదు నుండి శ్రీశైలం 200 కి.మీ. దూరంలో ఉంది.ఈ రోడ్డు అటవీ ప్రాంతం గుండా పోతుంది. అటవీశాఖ వారు రాత్రి వేళల్లో ఈ ప్రాంతం గుండా ప్రయాణించటానికి అనుమతించరు కనుక పగటి వేళ మాత్రమే ప్రయాణించాలి. గుంటూరు నుండి శ్రీశైలం 225 కి.మీ. దూరంలో ఉంది. గుంటూరు నుండి నరసరావుపేట, వినుకొండ మీదుగా వచ్చే ఈ మార్గం దోర్నాల వద్ద కర్నూలు రోడ్డుతో కలుస్తుంది. అక్కడి నుండి శ్రీశైలంకు కొండ మార్గంలో ప్రయాణం (53 కి.మీ.) కొండల మధ్యగా చాలా బాగుంటుంది.

రైలు మార్గములు:
భారతదేశములో ఏవైపునుండి అయినా గుంటూరు మీదుగా నరసరావుపేట వరకూ రైలు సౌకర్యములు కలవు.

విమాన మార్గములు:
హైదరాబాద్ నుండి విజయవాడ లేదా గుంటూరు వరకూ మైనర్ ఎయిర్ పోర్టులద్వారా చేరుకొని అటుపై బస్సు ద్వారా చేరవచ్చు.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...