చేజెర్ల - కపోతేశ్వరాలయం:
మాచర్ల-గుంటూరు మార్గంలో నర్సరావుపేటకు 20 కిలోమీటర్ల దూరంలో బస్సు ప్రయాణంలో చేరవచ్చును. చేజెర్ల చాలా చిన్న గ్రామం. కాని చాల పురాతనమైన ఆలయం కపోతేశ్వరాలయం. సుమారు క్రీ.శ. 3-4 శతాబ్దాలకు చెందినది. ఒక బౌద్ద చైత్యమును హిందూ దేవాలయంగా మార్చబడిందిగా తెలుస్తుంది. అయితే ఒక పూర్వగాధ మాత్రం చెప్పబడుతూ ఉంది ఇక్కడ ఇంకా మరికొన్ని చిన్ని చిన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు దక్షిణకాశిగా పేరుగాంచి మంచి వైభవంతో శోభిల్లిందని కొన్ని శాసనాలను బట్టి తెలుస్తుంది.
దీనికి చేజెర్ల అను పేరు రావటానికి కొంత పరిణామక్రమం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొదట 'చేరుంజెర్ల'గా ఉండి కాలక్రమేణా 'చేజెర్ల'గా మారినట్లు చెప్పుతున్నారు.శివక్షేత్రమయిన కపోతేశ్వరాలయంలో మూడు గజాల ఎత్తు గలిగిన సహస్ర లింగాకారమూర్తిగా వేంచేసియున్న ఈశ్వరుడు, మల్లికాపుష్పరణి ఓగేరు అనే నదీ ఉన్నాయి. జీర్ణావస్థలో ఉన్నదీ ప్రాచీన దేవాలయం.
మాంధాత చక్రవర్తి కుమారుడు శిబి చక్రవర్తి. ఆయనకు ఇద్దరు సోదరులు. వారు దక్షిణ దేశమునకువచ్చి ఇక్కడి ఋషీశ్వరులను చూచి వైరాగ్యాన్ని పొందారు. అందులో మేఘాడంబరుడు తపస్సుచేసి సిద్దిని పొంది లింగాకారంగా వెలిసినట్లు ఒక కథ. తరువాత జీమూతవాహనుడనే రెండవ సోదరుడు కూడా చేజెర్ల చేరి మొదటివాని మాదిరిగానే వైరాగ్యాన్ని పొందాడట. అప్పుడు శిబిచక్రవర్తి బయలుదేరివచ్చి ఆ ప్రదేశంలో 100 యజ్ఞాలు చేయసంకల్పించారనిన్నీ, తొంభయి తొమ్మిదో యజ్ఞము సమాప్తం కాగానే 100వ యజ్ఞము ప్రారంభంలో శిబి చక్రవర్తి త్యాగమును గూర్చి మనకు యిప్పటికీ ప్రచారంలో ఉన్న కధాంశము-పావురము, వేటకాడు, శిబిచక్రవర్తి కధ మనకు సుపరిచితమే. ఇది పావురాన్ని కాపాడటానికని, జీవకారుణ్య భావంతో వేటకానికి కావలసిన మాంసమును పావుర ప్రమాణమునకు తన ఒంటి కండల నుండి కోసి యిచ్చాడని ఆయన త్యాగనిరతకి మచ్చుతునకగా చెప్పుకొనే కథ బహుళ ప్రచారంలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ కథ ఇక్కడ జరిగినట్లు, శిబి త్యాగమునకు మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమై వరము లివ్వటం-శిబి తన దేహం, తన పరివారము అంతా శివాకారాలుగా మారి చేజెర్ల ప్రాంతములో ఉండేటట్లుగా వరమిచ్చారని పూర్వకథ చెప్తుంటారు.
ఈ ఆలయానికి సమీపంలో ఒక కొండమీద మల్లేశ్వరస్వామి ఆలయం, మరోకొండ మీద శ్రీకుమారస్వామి ఆలయం చూడదగినవి. తొలి యేకాదశికి, ప్రతి మాసశివరాత్రికి, దేవి నవరాత్రులు, విజయదశమికి ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి.