హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

శనివారం, ఫిబ్రవరి 13, 2016

రధసప్తమి

రథ సప్తమి దాని విశిష్టత.....!!

‘ఆరోగ్యం బాస్కరాధిచ్చేత్‌’ ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరుడు, సూర్య భగవానున్ని ఆరాదించే పండుగ 'రథ సప్తమి'. చిమ్మ చీకట్లను తరిమి.. చలిని తొలగించి నులు వెచ్చని ఉత్సాహాన్ని, చైతన్యాన్ని కలిగించే కర్మ సాక్షిగా నిలిచే సూర్యభగవానునికి కృతఙ్ఞతా సూచకంగా చేసే పండుగ ఇది. సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకంగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈ రోజు పవిత్రమైన రోజుగా భావించి భారతీయులు సూర్యున్ని ఆరాధిస్తారు.

చలికాలము చివర్లో.. వేసని కాలపు ఆరంభం మాఘ మాసమవుతుంది. 'రథసప్తమి' పండుగను మాఘ మాస శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారు. సూర్యుడు దక్షిణాయణం ముగించుకుని, ఉత్తరాయణంలో ప్రవేశించటానికి సూచనగా మనం రెండు పండగలను జరుపుకుంటాము. అందులో ఒకటి సంక్రాంతి. రెండవది రథ సప్తమి. సప్తమి సూర్యుని జన్మ తిధి. ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు, జరుపుకునే రథ సప్తమి సూర్య సంబంధమైన పండుగ.

శ్రీసూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి 6 ఆకులు. రథానికి 7 అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు 6 ఋతువులు. 7 అశ్వాలు 7 కిరణాలు. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసు.. అనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి. సూర్య భగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టి యొక్క దైవిక వికారాలను రూపు మాపి, సాయంకాలం విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు.

ధాతా, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పుషా, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్టా, విష్ణువు అనే ఈ 12 మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధారభూతులవుతున్నారని, ఈ 12 నామాలు స్మరిస్తే, దీర్ఘ రోగాలు నయమవుతాయని, దారిద్య్రం పోతుందని భవిష్య పురాణం చెబుతోంది.

ఈ 'రథ సప్తమి' రోజు తిరుమల తిరుపతిలో కూడా శ్రీవారిని ముందుగా సూర్యప్రభ వాహనం మీద ఊరేగింపు చేస్తారు. చివరన చంద్రప్రభ వాహనంపై ఊరేగిస్తారు. మిగతా వాహనాలు హనుమద్వాహన, గరుడ వాహన, పెదసేష వాహన, కల్పవృక్ష వాహన, స్వయం భూపాల వాహనాలపై స్వామివారిని ఊరేగిస్తారు. చక్రస్నానం కూడా ఇదే రోజు చేస్తారు. ఒక్క రోజు బ్రహ్మోత్సవాన్ని కన్నులపండుగగా జరుపుతారు. భక్తులు స్వామి వారిని కనులారా దర్శించుకుని తరిస్తారు.

ఏడు జన్మల పాపాలు నశిస్తాయి
రథ సప్తమికి ముందు రోజున రాత్రి ఉపవాసం చేసి, మరునాడు అంటే రథ సప్తమి అరుణోదయంతోనే స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెబుతోంది. స్నానానికి ముందు ప్రమిదలో దీపం వెలిగించి దానిని శిరసుపై నుంచి, సూర్యుని ధ్యానించి, దీపాన్ని నీటిలో వదిలి, స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు, జిల్లేడు ఆకులు, చిక్కుడు ఆకులు, రేగుపళ్ళు నెత్తిమీద పెట్టుకుని స్నానం చేయాలి.

ఇక స్నానానంతరం.. 'జననీత్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే.. సప్తమ్యా హ్యాదితే దేవి నమస్తే సూర్యమాతృకే'... అంటూ శ్లోకం చదివి, సూర్యునికి అర్ఘ్యమిచ్చి, ధ్యానం చేయాలి. అటు తర్వాత తల్లిదండ్రులు లేని వారైతే, పితృతర్పణం చేసి, చిమ్మిలి దానం చేయాలి.

ఇంకొందరు రథసప్తమి వ్రతం కూడా చేస్తారు. మాఘశుద్ధ షష్టి నాడు, అంటే రథసప్తమికి ముందు రోజు తెల్ల నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. బంధువులతో కలసి నూనె లేని వంటకాలతో భోజనం చేయాలి. రాత్రి ఉపవాసముండాలి. వేద పండితులను పిలిచి, వారినే సూర్య భగవానులుగా తలచి సత్కరించాలి. రాత్రికి నేలపై నిద్రించాలి. గురువుకు ఎరుపు వస్త్రాలు దానం చేయాలి.

ఈ పర్వదినాన బంగారము గాని, వెండిగాని, రాగిగాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో అలంకరించి అందులో ఎరుపు రంగు ఉండే సూర్యుని ప్రతిమను ఉంచి, పూజించి గురువునకు ఆ రథమును దానమీయవలెనని, ఆ రోజు ఉపవాసం ఉండి.. సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమంలను చూస్తూ కాలక్షేపం చేయాలి. ఇలా రథసప్తమీ వ్రతముతో సూర్య భగవానుని అనుగ్రహంతో ఆయురారోగ్యాది సకల సంపదలు వచ్చునని శాస్త్ర ప్రబోధము.

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహోద్యుతిం..
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం..
బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నంతు మహేశ్వరం..
సాయం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరం..
వినతాతనయో దేవః కర్మ సాక్షీ సురేశ్వరః..
సప్తాశ్వః సప్తరజ్జుశ్చ అరుణోమే ప్రసీదతు..
ఆదిత్యశ్య నమస్కారం యే కుర్వంతి దినే దినే..
జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే..
ఆ ప్రత్యక్ష భగవానుడి ఆశీర్వాదంతో.. అనుగ్రహంతో అందరూ సదా సర్వదా ఆరోగ్యంతో, ఆనందంతో జీవించాలని కోరుకుంటూ... అందరికీ రథ సప్తమి పర్వదిన శుభాకాంక్షలు.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...