|| ముండకోపనిషత్తు ||
ఓం
తత్ సత్
శాంతి
పాఠం :
ఓం
భ్రదం కర్ణేభి: శృణుయామ దేవా: !
భ్రదం
పశ్యేమాక్షభిర్యజత్రా: !
స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభి:
!
వ్యశేమ
దేవహితం యుదాయు: !
స్వస్తి
న ఇంద్రో వృద్ధశ్రవా: !
స్వస్తి
న: పూషా విశ్వవేదా !
స్వస్తి
నస్తార్ క్ష్యో అరిష్టవేమి: !
స్వస్తి
నో బృహస్పతి ర్దధాతు !!
ఓం
శాంతి: శాంతి: శాంతి:
ఓ దేవతలారా! మేం చెవులతో
శుభప్రదమైనదాన్ని వింటాం గాక. మేం కళ్లతో
శుభప్రదమైన దాన్ని చూస్తాంగాక. మీ
స్త్రోత్రాలను గానం చేస్తూ మాకు
నియమితమైన ఆయుష్కాలాన్ని పరిపూర్ణమైన
ఆరోగ్యంతో బలంతో జీవిస్తాం గాక.
కీర్తిమంతుడైన ఇంద్రుడు, సర్వజ్ఞుడైన సూర్యుడు, ఆపదల నుండి రక్షించే గురుత్మంతుండు,
మా బ్రహ్మవర్చస్సును పాలించే బృహస్పతి, మాకు శుభాన్ని కలుగచేస్తారు గాక.
ఓం శాంతి: శాంతి: శాంతి:
ముండకోపనిషత్తు (ప్రథమ ముండకం) :
ప్రథమ ఖండం :
1.
ఓం బ్రహ్మా దేవానాం ప్రథమ: సంబభూవ
విశ్వస్య
కర్తా భువనస్య గోప్తా !
స
బ్రహ్మవిద్యాం సర్వవిద్యా ప్రతిష్టామ్
అథర్వాయ
జ్యేష్ఠపుత్రాయ ప్రాహ !!
సృష్టికర్తా, జగద్రక్షకుడూ ఐన
బ్రహ్మ దేవతలందరికంటే ముండు పుట్టాడు.
ఆయనే జగత్తు సృష్టికర్త, రక్షకుడు. ఆయన
సకలశాస్త్రాలకూ ఆధారభూతమైన
బ్రహ్మవిద్యను తన పెద్ద తనయుడైన అథర్వునకు
అనుగ్రహించాడు.
2.
అథర్వణే యాం ప్రవదేత బ్రహ్మా-
థర్వాతాం
పురోవాచాంగిరే బ్రహ్మవిద్యామ్ !
స
భారద్వాజాయ సత్యవహాయ ప్రాహ
భారద్వాజోంగిరసే
పరావరామ్ !!
బ్రహ్మ అథర్వునకు ఉపదేశించిన
బ్రహ్మవిద్యను ప్రాచీన కాలంలో అథర్వుడు
అంగిరునకు బోధించాడు. ఆ విద్యనే భరద్వాజగోత్రుడైన
సత్యవహుడు అంగిరుని వద్ద గ్రహించాడు. ఇలా పరంపరగా వస్తున్న అపరావిద్యను సత్యవాహుడు
అంగిరసునికు అందజేశాడు.
3.
శౌనకో హ వై మహాశాలోంగిరసం
విధివదుపసన్న:
పప్రచ్ఛ !
కస్మిన్ను
భగవో విజ్ఙాతే
సర్వమిదం
విజ్ఞాతం భవతీతి !!
శునక ఋషి కుమారుడూ ఉత్తమ గ్రహస్థుడని
పేరు పొందిన వాడూ ఐన శౌనకుడూ
శాస్త్రోక్తరీతిగా అంగీరస మహర్షిని
సమీపించి వినమృడై ‘‘హే భగవన్, దేనిని
తెలుసుకోవడం చేత ఈ ప్రపంచం అంతా
తెలుసుకోబడుతుంది?’’ అని అడిగాడు.
4.
తస్మైస హోవాచ ! ద్వే విద్యే వేదితవ్యే
ఇతిహస్మ యద్
బ్రహ్మవిదో
వదంతి, పరా చైవాపరాచ !!
అంగిరసుడు శౌనకునికి ఇలా బదులు
చెప్పాడు. పరావిద్య అపరావిద్య అని తెలుసుకోవలసిన విద్యలు రెండు వున్నాయని
బ్రహ్మవిదులు చెబుతారు.
5.
తత్రాపరా, ఋగ్వేదో
యజుర్వేద:
సామవేదో
ధర్వవేద: శిక్షాకల్పో
వ్యాకరణం
నిరుక్తం ఛందో జ్యోతిషమితి !
అథ
పరా, యయా తదక్షర మధిగమ్యతే !!
ఈ రెండు విద్యల్లో నాలుగు వేదాలూ, వేదంగాలైన శిక్షా, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సూ, జ్యోతిషమూ అన్నీ అపరా
విద్యలే. ఇక శాశ్వతమూ అమరమూ ఐన
తత్త్వాన్ని అందించే విద్యే పరావిద్య.
6.
యత్ తదద్రేశ్య మగ్రాహ్య మగోత్రమ్
అవర్ణమ్
అచక్షు:
శ్రోత్రం తదపాణిపాదమ్ !
నిత్యం
విభుం సర్వగతం సుసూక్ష్మం
తదవ్యయం
యద్ భూతయోనిం పరిపశ్యంతిధీరా: !!
కళ్లు మొదలైన జ్ఞానేంద్రియాలకు
గోచరంకానిదీ, చేతులు మొదలైన
కర్మేంద్రియాలకు దొరకనిదీ, ఉత్పత్తిలేనిదీ, రంగు లేనిదీ, కళ్లు చెవులు చేతులు కాళ్లు లేనిదీ,
శాశ్వతమైనదీ, అంతటా వ్యాపించినదీ, అత్యంతమూ సూక్ష్మమైనదీ సృష్టికి మూలకారణమైనది ఐన ఆ అక్షరతత్త్వాన్ని
జ్ఙానులు సకల జగత్తుకూ మూలంగా అంతటా చూడగలరు.
7.
యథోర్ణనాభి: సృజతే గృహ్ణతే చ
యథా
పృథివ్యామ్ ఓ షధయ: సంభవంతి !
యథా
సత: పురుషాత్ కేశలోమాని
తథా
క్షరాత్ సంభవతీహ విశ్వమ్ !!
సాలెపురుగు ఎలా తన గూడును నోటి నుండే
వెలికితీసి తనలోకే తీసుకుంటుందో, భూమినుండి మూలికలన్నీ ఎలా ఉద్భవిస్తాయో, మానవుని తలమీద, శరీరంమీద ఏ ప్రయత్నం లేకనే వెంట్రుకలు ఎలా పెరుగుతాయో అలాగే ఆ
అక్షరతత్త్వం నుండి ఈ విశ్వం ఉత్పన్నమౌతుంది.
8.
తపసా చీయతే బ్రహ్మతతో న్నమభిజాయతే !
అన్నాత్
ప్రాణో మన: సత్యంలోకా: కర్మసు చామృతమ్ !!
తపస్సు వల్ల బ్రహ్మ పెంపొందుతుంది. ఆ
బ్రహ్మంనుండి అన్నం పుడుతుంది. ఆ
అన్నం నుండి ప్రాణశక్తి, మనస్సు, పంచభూతాలు, లోకాలు, కర్మలు అన్నీ ఉద్భవించాయి.
9.
య: సర్వజ్ఞ: సర్వవిద్యస్య జ్ఞానమయం తప:
!
తస్మాదేతద్
బ్రహ్మ నామరూపమన్నం చ జాయతే !!
సృష్టికర్త, సర్వవిదుడు, జ్ఞానమే తపంగా గల
బ్రమ్మ సకల ప్రాణులు వాటి ఆహారం అన్నీ పరబ్రహ్మంనుండి ఉద్భవిస్తున్నవి.
(ఇది మొదటి ముండకంలోని మొదటి ఖండం)
ద్వితీయ ఖండం :
1.
తదేతత్ సత్యమ్
మంత్రేషు
కర్మాణి కవయో యాన్యపశ్యం -
స్తాని
త్రేతాయాం బహుధా సన్తతాని !
తాన్యాచరథ
నియతం సత్యకామా
ఏష
వ: పన్థా: సుకృతస్యలోకే !!
ఋషులు వేదమంత్రాలలో ఏయే యజ్ఞకర్మలను
దర్శించారో అవి అన్నీ కూడా సత్యమే.
మూడు వేదాలు వీనిని చాలా వివరంగా
వర్ణిస్తాయి. సత్యప్రియులారా ! వాటిని
మీరు విధిగా నిరంతరం అనుష్ఠించండి.
పుణ్యకర్మల ఫలితాలైన లోకాలకు మార్గం
అదే.
2.
యదా లేలాయతే హ్యర్చి: సమిద్ధే హవ్యవాహనే
!
తదా
జ్యభాగౌ అన్తతరేణా హుతీ: ప్రతిపాదయేట్ !!
హోమాగ్ని చక్కగా మండుతూ జ్వాలలు లేస్తూ
వున్నప్పుడు అగ్నికి రెండుభాగాల మధ్య శ్రద్ధతో ఆహుతులు సమర్పించాలి.
3.
యస్యాగ్రిహోత్రమ్ అదర్శమ్ అపౌర్ణమాసం
అచాతుర్మాస్యమ్
అనాగ్రయణమ్ అతిథివర్జితం చ !
అహుతమ్
అవైశ్వదేవమ్ అవిధినా హుతం
ఆసప్తమాంస్తస్య
లోకాన్ హినస్తి !!
అగ్నిహోత్రయజ్ఞంలో అమావాస్యనాడు, పున్నమినాడు
చాతుర్మాస్యంలో పంట నూర్పిడి సమయంలో చేయాల్సిన కర్మలు చేయకపోయినా, యజ్ఞసమయంలో చేయాల్సిన
కర్మలు చేయకపోయినా, యజ్ఞ సమయంలో అతిథులు లేకపోయినా,
విశ్వదేవతలకు ఆహుతులు లేకపోయినా, పశుపక్ష్యాదులకు ఆహారదానం చేయకపోయినా, శాస్త్రవిధికి విరుద్ధమైనా - అలాంటి యజ్ఞం ఏడులోకాలలోనూ యజ్ఞకర్త ఉత్తరగతులను
నాశనం చేస్తుంది.
4.
కాలీ కరాలీ చ మనోజవా చ
సులోహితా
యా చ సుధామ్రవర్ణా !
స్ఫులింగినీ
విశ్వరుచీ చ దేవీ
లేలాయమానా
ఇతి సప్త జిహ్వా: !!
కాలీ,
కరాలీ,
మనోజవా,
సులోహితా,
సుధామ్రవర్ణా, స్ఫులింగినీ, విశ్వరుచీ అనే ఈ ఏడు
భుగభుగలాడే అగ్నికి ఏడు నాలుకలు.
5.
ఏతేషు యశ్చరతే భ్రాజమానేషు
యథాకాలం
చా హుతయో హ్యాదదాయన్ !
తం
నయన్త్యేతా: సూర్యస్య రశ్మయో
యత్రదేవానాం
పతిరేకో ధివాస: !!
దేదీప్యమానమైన ఈ జ్వాలలో ఎవడు యథాకాలంలో
ఆహుతులిస్తూ వుంటాడో, అతణ్ణి ఆ
ఆహుతులు సూర్యకిరణాలై దేవతలకు ప్రభువైన
ఇంద్రుడు నివసించే స్థానానికి
తీసుకువెళతాయి.
6.ఏహ్యేహీతి తమాహుతయ: సువర్చన:
సూర్యస్య
రశ్మిభిర్యజమానం వహన్తి !
ప్రియాం
వాచమ్ అబివదన్త్యో ర్చయన్త్య
ఏష
వ: పుణ్య: సుకృతో బ్రహ్మలోక: !!
కళకళలాడే ఆ ఆహుతులు ‘‘రండి రండి’’ అని ఆహ్వానిస్తూ
యజ్ఞకర్తను సూర్యకిరణాల ద్వారా తీసుకుపోతాయి. మధురంగా మాటలాడుతూ
సన్మానపూర్వంగా ‘‘మీరు మీ పుణ్యకర్మలచే ఆర్జించుకొన్న పావనమైన బ్రహ్మలోకం ఇదే’’ అంటూ అతణ్ణి కొనిపోతాయి.
7.
ప్లవాహ్యేతే అదృఢా యజ్ఞరూపా
అష్టాదశోక్తమ్
అవరం యేషుకర్మ !
ఏతచ్ర్చేయో
యే భినన్దన్తి మూఢా
జరామృత్యుం
తే పునరేవాపి యన్తి !!
పద్దెనిమిది అంగాలతో కూడిన
యజ్ఞకర్మలన్నీ నిజానికి దుర్బలాలైన
తెప్పలవంటివే. ఇదే జీవిత పరమార్థమని
కొనియాడే మూర్ఖులు నిస్సంశయంగా మళ్లీ
మళ్లీ జరామృత్యు చక్రంలో పడి తిరుగుతూ
వుంటారు.
8.
అవిద్యాయామన్తరే వర్తమానా :
స్వయం
ధీరా: పణ్డితం మన్యమానా: !
జంఘన్యమానా:
పరియన్తి మూఢా
అన్ధేనైవ
నీయమానా యథాన్ధా: !!
ప్రాపంచికత అజ్ఞానంలో ఊరుతూ తామే
ప్రజ్ఞాశీలురం, విదితవేదితవ్యులమూ అని
ఆత్మస్తుతి చేసుకునే మూర్ఖులు రోగం, ముసలితనం, మృత్యువు వంటి దు:ఖ పరంపరలచేత మళ్లీ మళ్లీ పీడింపబడుతూ గుడ్డివాని నేతృత్వంలోని
నడిచే మరికొందరు గుడ్డివాళ్లలా జన్మజన్మలకూ దారి తెలియక తిరుగాడుతూ
వుంటారు.
9.
అవిద్యాయాం బహుధా వర్తమానా
వయం
కృతార్థా ఇత్యభిమన్యంతి బాలా: !
యత్కర్మిణో
న ప్రవేదయంతి రాగాత్
తేనాతురా:
క్షీణలోకాశ్చ్యవంతే !!
అజ్ఞానంలో మునిగి వున్న ఈ మూర్ఖులు తామే
కృత కృత్యులమని భావిస్తుంటారు.
ఎందుచేతనంటే కర్మఫలాలపట్ల ఆసక్తి
వున్నంతవరకు వారికి జ్ఞానోదయం కాదు.
అందుచేత పుణ్యకర్మల ఫలితమైన స్వర్గాది
లోకాలు అనుభవించాక వారికి మళ్లీ
అధోగతే !
10.
ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం
నాన్యచ్ర్చేయో
వేదయన్తే ప్రమూఢా: !
నాకస్య
పృష్ఠే తే సుకృతే నుభూత్వా
ఇమంలోకం
హీనతరం వా విశన్తి !
ఈ మందుబుద్ధులు యజ్ఞకర్మలు, పుణ్యకార్యాలూ
మాత్రమే సర్వోత్తమమైన పనుకొంటూ అంతకు మించినది లేదనుకొంటారు. వీళ్లు భోగాలకు
పుట్టినిళ్లయిన స్వర్గలోకాలలో తమ పుణ్యఫలాన్ని అనుభవించి మళ్లీ ఈ లోకాన్ని
వదిలి హీనమైన లోకాల్లో ప్రవేశిస్తారు.
11.
తప: శ్రద్ధే యే హ్యుపవసన్త్యరణ్యే
శాన్తా
విద్వాంసో భైక్ష్యచర్యాం చరస్త: !
సూర్యద్వారేణ
తే విరజా: ప్రయాన్తి
యత్రామృత:
స పురుషో హి అవ్యయాత్మా !!
శాంతచిత్తులు, విద్వాంసులు
భిక్షాటనవ్రతులై అడవిలో ఏకాంతంగా
శ్రద్ధాపూర్వకమైన తపోనిష్టితో
జీవితాన్ని గడిపే సత్పురుషులు పాపధూళిని
కడిగివేసుకుని సూర్యమార్గం ద్వారా
శాశ్వతం అక్షయం ఐన తత్త్వం వుండే చోటికి
చేరుకుంటారు.
12.
పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో
నిర్వేదమాయాత్
నాస్త్యకృత: కృతేన !
తద్విజ్ఞానార్థం
స గురుమేవాభిగచ్ఛేత్
సమిత్పాణి:
శ్రోత్రియం బ్రహ్మనిష్ఠమ్ !!
వివిధ కర్మలద్వారా ప్రాప్తించే లోకాలను
పరీక్షించి ముముక్షువు వానిపట్ల
వైరాగ్యాన్నీ, ఔదాసీన్యాన్ని
వహించాలి. కర్మలువల్ల పరతత్త్వాన్ని పొందలేము ! అందుచేత ఆ
తత్త్వాన్ని తెలుసుకోవడానికి అతడు విధ్యుక్తంగా వేదవిదుడు, బ్రహ్మనిష్ఠుడు ఐన
గురువువద్ద శిష్యరికం చేయాలి.
13.
తస్మై స విద్వానుసపన్నాయ సమ్యక్
ప్రశాస్త
చిత్తాయ శమాన్వితాయ !
యేనాక్షరం
పురుషం వేద సత్యం
ప్రోవాచ
తాం తత్త్వతో బ్రహ్మవిద్యామ్ !!
సాధన సంపత్తి కలిగి నిశ్చలమైన మనస్సుతో
యథావిధిగా సమీపించిన ఆ ముముక్షువుకు, జిజ్ఞాసువుకు ప్రాజ్ఞుడైన గురువు అక్షరమైన తత్త్వాన్ని అందించే బ్రహ్మవిద్యను సాకల్యంగా ఉపదేశించాలి.
(ఇది మొదటి ముండకంలో రెండవ ఖండం)
ద్వితీయ ముండకం
(ప్రథమ ఖండం) ;
1.
తదేతత్ సత్యమ్ యథా సుదీప్తాత్ పావకాద్
విస్ఫులింగా:
సహస్రశ: ప్రభవంతే సరూపా: !
తథా
క్షరాత్ వివిధా: సోమ్య భావా:
ప్రజాయన్తే
తత్ర చైవాపి యన్తి!!
భావం : సత్యం ఇదే....
జ్వాలలు లేస్తున్న మంటలనుండి నిప్పురవ్వలు వేలకొలది ఎలా పుట్టుకొస్తాయో, అదేవిధంగా అక్షరమైన బ్రహ్మంనుండి నానావిధాలైన జీవులు ఉద్భవిస్తాయి. మళ్లీ అందులోనే లీనమవుతాయి.
2.
దివ్యో హ్యమూర్త: పురుష:
సబాహ్యాభ్యన్తరో
హ్యజ: !
అప్రాణో
హ్యమనా: శుభ్రో
హ్యక్షరాత్పరత:
పర: !!
భావం : స్వత:
ప్రకాశం, నిరాకారం, అనాది
శుద్ధం,
సర్వవ్యాపకం అయిన ఆ తత్త్వం లోపల, వెలుపల కూడా వుంది.
జీవానికి, మనస్సుకు ప్రాచీనమైన ఆ తత్త్వం అవ్యక్తమై జగత్తు కారణరూపానికి
కూడా అతీతమైంది.
3.
ఏతస్మాజ్జాయతే ప్రాణో మన:
సర్వేంద్రియాణి చ!
ఖం
వాయుర్జ్యోతిరాప: పృథివీ విశ్వస్వ ధారిణీ !!
భావం : ఆ తత్త్వం నుండే జీవం, మనస్సు, అన్ని ఇంద్రియాలు, గాలి, ఆకాశం, నిప్పు, నీళ్లు, సకలాధారమైన భూమి
అన్నీ పుట్టాయి.
4.
అగ్నిర్మూర్ధా చక్షుషీ చంద్రసూర్యౌ
దిశ:
శ్రోత్రే వాగ్వివృతాశ్చ వేదా: !
వాయు:
ప్రాణో హృదయం విశ్వమస్య
పద్భ్యా
పృథివీ హ్యేష సర్వభూతాన్తరాత్మా !!
భావం : ఆ తత్త్వానికి
దేవలోకం శిరస్సు. సూర్యచంద్రులు కళ్లు. దిక్కులు చెవులు. ప్రసిద్ధమైన వేదాలు
తెరిచి వున్న నోళ్లు, గాలి ఊపిరి. జగత్తు గుండె. ఈ భూమి పుట్టుక పాదాలనుండే. ఈ
తత్త్వమే సర్వభూతాలలోనూ వున్న ఆత్మకూడా.
5.
తస్మాదగ్ని: సమిధో యస్య సూర్య:
సోమాత్పర్జన్య
ఓషధయ: పృథివ్యామ్ !
పుమాన్
రేత: సించతి యోషితాయాం
బహ్వీపజా:
పురుషాత్ సంప్రసూతా: !!
భావం : ఆ తత్త్వం నుండి
దేవలోకం పుట్టింది. సూర్యుడు దేవలోకాన్ని ప్రకాశింపచేస్తున్నాడు. దేవలోకంలో వున్న
చంద్రుడు నుండి వర్షమేఘాలు.. ఆ మేఘాల వల్ల భూమిపైన ఔషధాలు జనించాయి.
పురుషుడు, స్త్రీయందు రేతస్సు విడవడం ద్వారా జీవులు పుట్టాయి. ఈ విధంగా
సర్వవ్యాపి అయిన ఆ తత్త్వం నుండి ఎన్నో జీవులు పుట్టుకొచ్చాయి.
6.
తస్మాదృచ: సామ యజూంషి దీక్షా
యజ్ఞాశ్చ
సర్వే క్రతవో దక్షిణాశ్చ !
సంవత్సరశ్చ
యజమానశ్చ లోకా:
సోమో
యత్ర పవతే యత్ర సూర్య: !!
భావం : ఈ తత్త్వం నుండి
వేదాలు, సామగానాలు, యజ్ఞవిధులు, వ్రతదీక్షలు, క్రతువులు, కర్మలు, యజ్ఞదక్షిణలు, యజ్ఞసమయం, యజమాని, సూర్యచంద్రులు పావనం చేసే లోకాలు అన్నీ కూడా ఉద్భవిస్తాయి.
7.
తస్మాచ్చ దేవా బహుధా సంప్రసూతా:
సాధ్యా
మనుష్యా: పశవో వయాంసి !
ప్రాణాపానౌ
వ్రీహియవై తపశ్చ
శ్రద్ధా
సత్యం బ్రహ్మచర్యం విధిశ్చ !!
భావం : ఆ తత్త్వం నుండి
వివిధ లోకాలలోని దేవతలు, సాధ్యులు, మానవులు, జంతువులు, పక్షులు, ఉచ్ఛ్వాసనిశ్వ్శాసాలు,
వరియువధాన్యాలు, తపస్సు, శ్రద్ధ, సత్యం, బ్రహ్మచర్యం, విధినిషేధాలు అన్నీకూడా పుట్టుకొచ్చాయి.
8.
సప్తప్రాణా: ప్రభవన్తి తస్మాత్
సప్తార్చిష:
సమిధ: సప్త హోమా: !
సప్త
ఇమే లోకా యేషు చరన్తి ప్రాణా
గుహాశయా
నిహితా: సప్త సప్త !!
భావం : ఆ పరతత్త్వం నుండి ఏడు ఇంద్రియాలు, వాటి గ్రహణ శక్తులు, వాటి విషయాలు, వాటి జ్ఞానం, హృద్గుహలలో వుంటూ జీవశక్తులు సంచరించే ఏడేడు లోకాలు, అన్నీ ప్రభవిస్తాయి.
ఇవన్నీ ఏడేడుగా భగవంతుడే సృష్టించాడు.
9.
అంత: సముద్రా గిరియశ్చ సర్వే స్మాత్
స్యన్దన్తే
సిన్ధవ: సర్వరూపా: !
అతశ్చ
సర్వా ఓషధయో రసశ్చ
యేనైష
భూతైస్తిస్ఠతే హ్యన్తరాత్మా !!
భావం : అన్ని సముద్రాలు, పర్వతాలు కూడా భగవంతుడు నుండే సంభవిస్తాయి. అన్ని నదులు ఆయన నుండే
ప్రవహిస్తాయి. ఏ మూలికల రసాలచేత పోషించబడి పంచభూతాలతో ఆవరించబడిన సూక్ష్మశరీరం
వుంటుందో ఆ మూలికలన్నీ ఆ పరతత్త్వం నుండే సంభవిస్తాయి.
10.
పురుష ఏవేదం విశ్వం కర్మ
తపో
బ్రహ్మ పరామృతమ్ !
ఏతద్యో
వేద నిహితం గుహాయాం
సో
విద్యాగ్రన్థిం వికిరతీహ సోమ్య !!
భావం : స్వగతమైన ఆ తత్త్వం
యజ్ఞకర్మలు, జ్ఞానం, తపస్సు ఈ సమస్తంలోనే వుంది. ఓ సౌమ్యుడా! హృద్గుహలలో ఒదిగివున్న సర్వ శ్రేష్ఠమూ,
అమరమూ అయిన బ్రహ్మం ఆ తత్త్వమే అని
తెలుసుకున్నవాడు అవిద్యాగ్రంథిని తెంచేసి ఈ జన్మలోనే ముక్తుడవుతాడు.
(ఇది ద్వితీయ ముండకంలో మొదటి ఖండం)
ద్వితీయ ఖండం :
1.
ఆవి: సన్నిహితం గుహాచరం నామ
మహత్పదమత్రైతత్
సమర్పితమ్ !
ఏజత్
ప్రాణాన్నిమిషచ్చ యదేతత్ జానథ సదసద్వరేణ్యం
పరం
విజ్ఞానాద్ వరిష్ఠం ప్రజానాం !!
భావం : అన్ని అనుభవాలలో
ప్రత్యక్షమయ్యేది.. అత్యంత సమీపంలో వుంది. హృద్గుహలో సంచరించేది ఐన ఈ బ్రహ్మం
అన్నింటికీ ఆశ్రయం. కదిలేవి,
శ్వాసించేవి, రెప్పలార్చేవి, ఆర్చనివి కూడా సమస్తం
ఈ బ్రహ్మంలోనే ప్రతిష్టమై వున్నాయి. స్థూలసూక్ష్మాలకు కారణం
సర్వారాధ్యం, సర్వోత్కృష్టం,
విజ్ఙానానికి కూడా అతీతమైన ఆ బ్రహ్మాన్ని
తెలుసుకో.
2.
యదర్చిమద్ యదణుభ్యో ణు చ
యస్మిన్
లోకా నిహితా లోకినశ్చ !
తదేతదక్షరం
బ్రహ్మ స ప్రాణస్తదు వాఙ్మన :
తదేతత్సత్యం
తదమృతం తద్వేద్ధవ్యం సోమ్య విద్ధి !!
భావం : ప్రకాశవంతం అణువుకంటే
సూక్ష్మం అయిన ఆ అక్షరబ్రహ్మం... సకల లోకాలకు ఆ లోకవాసులకు కూడా నిలయం. ఆ
బ్రమ్మమే ప్రాణం, వాక్కు, మనస్సు, సద్వస్తువు, అమరత్వం కూడా.
3.
ధనుర్గహీత్వౌపనిధం మహాస్త్రం
శరం
హి ఉపాసానిశితం సన్థయీత !
ఆయమ్య
తద్భావగతేన చేతసా
లక్ష్యం
తదేవాక్షరం సోమ్య విద్ధి !!
భావం : ఉపనిషత్తులు అందించే
మహాస్త్రాన్ని ధనస్సుగా తీసుకో. నియమానుసారం నిత్యం చేసే ఉపాసనవల్ల తీక్షమైన
బాణాన్ని ఎక్కుపెట్టు. ఎటూ చెదరకుండా బ్రహ్మచింతనలోనే కేంద్రీకృతమైన
మనస్సుచేత వింటినారిని చెవిదాకా లాగు! నాశంలేని బ్రమ్మమే లక్ష్యం. ఆ
బ్రహ్మాన్ని తెలుసుకో.
4.
ప్రణవో ధను: శరో హ్యాత్మా బ్రహ్మం
తల్లక్ష్య ముచ్యతే !
అప్రమత్తేన
వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్ !!
భావం : ఓం అనే ప్రణవమంత్రమే
ధనస్సు. లోనున్న ఆత్మయే బాణం. బ్రహ్మమే లక్ష్యం. ఏమరుపాటులేని మనస్సుతో ఆ
లక్ష్యాన్ని ఛేదించాలి. బాణం లక్ష్యాన్ని ఛేదించి దాంతో ఒకటైపోయినట్లే
బ్రహ్మంతో ఏకమవ్వాలి.
5.
యస్మిన్ ద్యౌ: పృథివీ చాన్తరిక్షమోతం
మన:
సహ ప్రాణైశ్చ సర్వై: !
తమేవైకం
జానథ ఆత్మానమ్ అన్యా
వాచో
విముఞ్చథా అమృతస్యైష సేతు: !!
భావం : భూమి, ఆకాశాలు వాటిమధ్య
వున్న అంతరాళము, మనస్సు పంచప్రాణాలు దేనియందు పడుగు పేకగా అల్లుకొని వున్నాయో.. అదే ఆత్మ అని తెలుసుకో. తదితరమైన వ్యర్థప్రసంగాలు వదిలిపెట్టు.
ఈ సంసారసాగరాన్ని దాటి అమరత్వం చేర్చే సేతువు ఇదే.
6.
అరా ఇవ రథనాభౌ సంహతా యత్ర నాడ్య:
స
ఏషో న్తశ్చరతే బహుధా జాయమాన: !
ఓమిత్యేవం
ధ్యాయథ ఆత్మానం
స్వస్తి
వ: పారాయ తమస: పరస్తాత్ !!
భావం : రథ చక్రంలోని
ఆకులన్నీ ఇరుసును చేరి వున్నట్లు... శరీరంలోని అన్ని నాడులు, సిరలు చేరి వుండే
హృదయకోశం లోలోపల ఆత్మ అనేక విధాలై సంచరిస్తూ వుంటుంది. ఆ ఆత్మనే ఓం అని
ధ్యానించడం. అజ్ఞానాంధకారాన్ని దాటిపోవడంలో మీకు శుభం కలుగుగాక!
7.
య: సర్వజ్ఞ సర్వవిద్యస్యైష మహిమా భువి !
దివ్యే
బ్రహ్మపురే హ్యేష వ్యోమ్న్యాత్మా ప్రతిష్ఠిత : !!
మనోమయ:
ప్రాణ శరీరనేతా
ప్రతిష్ఠితో
న్నే హృదయం సన్నిధాయ !
తద్విజ్ఞానేన
పరిపశ్యన్తి ధీరా
ఆనందరూపమ్
అమృతం యద్విభాతి !!
భావం : ఆత్మకు అన్నీ అవగతమే.
సమగ్రంగా తెలుసు. ఈ భూమిపైన కనిపించేదంతా కూడా ఆ ఆత్మవైభవమే.
హృదయాకాశంలోని జ్యోతిర్మయమైన బ్రహ్మపురిలో దాని నివాసం. మనస్సే దానికి
వస్త్రం. ప్రాణ శరీరాలకు అది అధినేత. హృదయంలో స్థిరపడి అది శరీరమంతట
నివసిస్తుంది. పరిపూర్ణమైన విజ్ఞానంచేత ప్రాజ్ఞులు ఆనందమయమైన ఆ
అమరత్వస్థితిని సాక్షాత్కరించుకుంటారు.
8.
భిద్యతే హృదయగ్రంథి: ఛిద్యన్తే
సర్వసంశయా: !
క్షీయన్తే
చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే !!
భావం : ఎగుడు, దిగుడులలో కూడా
ఆత్మను సాక్షాత్కరించుకోవడం వల్ల అతని అజ్ఞానపు ముడి విడిపోతుంది.
అన్ని సంశయాలు సమసిపోతాయి. అన్ని కర్మలు క్షయించిపోతాయి.
9.
హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ
నిష్కలమ్ !
తచ్ఛుభ్రం
జ్యోతిషాం జ్యతిస్తద్యద్ ఆత్మవిదో విదు: !!
భావం : జ్యోతిస్వరూపమైన ఆ
ఆనందమయకోశంలో మానవుని నిగూఢ గహనాలలో నిర్మలంని రవయవం విశుద్ధం అయిన బ్రహ్మం
వాసం చేస్తుంది. కాంతినిచ్చే అన్నింటికి కాంతి అదే. దాన్నే
ఆత్మవిదులు సాక్షాత్కరించుకుంటారు.
10.
న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం
నేమా
విద్యుతో భాంతి కుతో యమగ్ని: !
తమేవ
భాన్తమనుభాతి సర్వం
తస్యభాసా
సర్వమిదం విభాతి !!
భావం : అక్కడ సూర్యుడు
ప్రకాశించడు. చంద్రుడు, తారలు వెలుగు నీయవు. మెరుపులు కూడా కాంతి నీయవు. ఇక కేవలమైన అగ్ని మాట చెప్పడమెందుకు?
ఆత్మ తేజస్సు వల్ల మాత్రమే సర్వమూ కాంతిలీనుతుంది! ఈ యావద్విశ్వమూ ఆ ఆత్మజ్యోతి వల్లనేదే
దిప్యమానమవుతూ వుంది.
11.
బ్రహ్మైవేదమమృతం పురస్తాద్ బ్రహ్మ
పశ్చాద్
బ్రహ్మ దక్షిణతశ్చోత్తరేణ !
అధశ్చోర్ధ్వం
చ ప్రసృతం
బ్రహ్మైవేదం
విశ్వమిదం వరిష్ఠమ్ !!
భావం : నిజంగా ఇదంతా
శాశ్వతమైన బ్రహ్మమే. కింద-మీద, ఈ పక్క - ఆ పక్క,
ముందు - వెనుక, సర్వత్రా ఆ బ్రహ్మం
విరాజమానమై వుంది. నిజంగా ఈ యావద్విశ్వం సర్వోత్కృష్టమైన ఆ బ్రహ్మమే.
(రెండవ ముండకంలోని రెండవ భాగం)
తృతీయ ముండకం
ప్రథమ ఖండం :
1.
ద్వా సుపర్ణా సయుజా సఖాయా
సమానం
వృక్షం పరిషస్వజాతే !
తయోరన్య:
పిప్పలం స్వాద్వత్త్వి
అనశ్నన్
అన్యో అభిచాకశీతి !!
భావం : ప్రాణ స్నేహితులై
ఎప్పుడూ కలిసి వుండే రెండు పక్షలు ఒకే చెట్టుపైన కూర్చొని వున్నాయి. అందులో ఒకటి
చెట్లు పండ్లను ఆసక్తికరంగా తింటోంది. మరొకటి తినకుండా చూస్తూ వుంది.
2.
సమానే వృక్షో పురుషో నిమగ్నో
నీశయా
శోచతి ముహ్యమాన: !
జుష్టం
యదా పశ్యత్యన్యమ్
ఈశమస్య
మహిమానమితి వీతశోక: !!
భావం : ఒకే చెట్టుమీద
కూర్చున్న ఆ రెండింటిలో ఒకటి జీవాత్మ. అజ్ఞానంలో,
భ్రమలో మునిగి తన దౌర్బల్యానికి
దు:ఖిస్తున్నది. కానీ ఆరాధనీయమైన ప్రభువైన దానిని, పరమాత్మను, దాని వైభవాన్నీ
చూడగానే దాని దు:ఖమంతా తరిగిపోతున్నది.
3.
యదా పశ్య: పశ్యతే రుక్మవర్ణం
కర్తారమీశం
పురుషం బ్రహ్మయోనిం !
తదా
విద్వాన్ పుణ్యపాపే విధూయ
నిరంజన:
పరమం సామ్యముపైతి !!
భావం : స్వయం ప్రకాశమైన, సృష్టికర్తయైన బ్రహ్మకు కూడా ఆదియైన,
సకల జగత్తుకు కర్తయైన, ప్రభువైన పరమాత్మను సాక్షాత్కరించుకోగానే విద్వాంసుడై సాధకుడు పుణ్యపాపాల
నతిక్రమించి దుఖ:రహితం సర్వోత్కృష్టం సమస్థితిని చేరుకుంటాడు.
4.
ప్రాణో హ్యేష య: సర్వభూతైర్విభాతి
విజానన్
విద్యాన్ భవతే నాతివాదీ !
ఆత్మక్రీడ
ఆత్మరతి: క్రియావాన్
ఏష
బ్రహ్మవిదాం వరిష్ఠ: !!
భావం : ప్రాణమై ఆ ఈశ్వరుడే
సకల జీవులలో ప్రకాశిస్తున్నాడు. ఇది సాక్షాత్కరించుకున్నవాడు వాక్కును
గ్రహించి, నిజమైన
విద్వాంసుడవుతాడు. అతడు నిత్యం ఆత్మయందే
విహరిస్తూ, ఆత్మయందే ఆనందిస్తూ,
పుణ్యకర్మలను చేస్తూ, బ్రహ్మజ్ఞానులలో
అగ్రస్థానం వహిస్తాడు.
5.
సత్యేన లభ్యస్తపసాహ్యేష ఆత్మా
సమ్యగ్
జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యమ్ !
అంత:శరీరే
జ్యోతిర్మయో హి శుభ్రో
యం
పశ్యన్తి యతయ: క్షీణదోషా: !!
భావం : ఆత్మనిగ్రహం గలవారు
తమలోని పాపకల్మషం, లేశమాత్రం కూడా లేకుండా క్షయించిపోగా... జ్యోతిర్మయం పరిశుద్ధం
అయిన ఆత్మను సాక్షాత్కరించుకుంటారు. సత్యం తపస్సుధ్యానం జ్ఞానం
బ్రహ్మచర్యం చక్కగా నిరంతరాయంగా అభ్యసించడం చేత ఆ ఆత్మ మనస్సులోనే
లభ్యమవుతుంది కదా!
6.
సత్యమేవ జయతే నానృతం
సత్యేన
పన్థా వితతో దేవయాన: !
యేనాక్రమన్తి
ఋషయో హి ఆప్తకామా
యత్ర
తత్సత్యస్య పరమం నిధానమ్ !!
భావం : సత్యవాదులే
గెలుస్తారు. అసత్యవాదులు ఎప్పటికి నెగ్గరు. దేవయానం సత్యంతోనే ఏర్పడింది. కోరికలు లేని
ఋషులు మార్గం ద్వారానే నిత్యనిలయమైన పరమపదాన్ని చేరుకుంటారు.
7.
బృహచ్చ తద్ దివ్యమ్ అచిన్త్యరూపం
సూక్ష్మాచ్చ
తత్ సూక్ష్మతరం విభాతి !
దూరాత్
సుదూరే తదిహాన్తికే చ
పశ్యత్సు
ఇహైవ నిహితం గుహాయామ్ !!
భావం : అపరిమితమై, జ్యోతిస్వరూపం
ఊహాతీతమై బ్రహ్మం ప్రకాశిస్తుంది. అది సూక్ష్మాతి సూక్ష్మం, దూరాతి దూరం. అది
ఇక్కడే ఈ శరీరంలోనే వుంది. ఋషులు హృదయస్థమై వున్నదాన్ని ఈ జన్మలోనే సాక్షాత్కరించుకుంటారు.
8.
న చక్షషా గృహ్యతే నాసి వాచా
నాన్యైర్దేవైస్తపసా
కర్మణా వా !
జ్ఞానప్రసాదేన
విశుద్ధ సత్త్వస్
తతస్తు
తం పశ్యతే నిష్కలం ధ్యాయమాన: !!
భావం : ఆత్మను మాటలతో
వర్ణింపనలవికాదు, దాన్ని కళ్లు చూడలేవు. ఇంద్రియాలు గ్రహించలేవు. కర్మలు, విధులు దానిని ఆవిష్కరించలేవు. అవబోధ ప్రశాంతమై స్వచ్చమైనప్పుడు అతని ప్రాణ
మన శరీరాలు సర్వం విశుద్ధి పొందుతాయి. అప్పుడు ధ్యానమగ్నుడైనవాడు ఆత్మను సాక్షాత్కరించుకుంటాడు.
9.
ఏషో ణురాత్మా చేతసా వేదితవ్యో
యస్మిన్
ప్రాణ: పంచధా సంవివేశ !
ప్రాణైశ్చిత్తం
సర్వమోతం ప్రజానాం
యస్మిన్
విశుద్ధే విభవ త్యేష ఆత్మా !!
భావం : ప్రాణం ఐదు విధాలుగా
వ్యాపించి వున్న ఈ శరీరంలో సూక్ష్మమైన ఆత్మతత్త్వాన్ని విజ్ఞానం ద్వారా
తెలుసుకోవాలి. మానవుని జ్ఞానాన్ని ఇంద్రియాలు చిక్కగా అల్లుకొని వున్నాయి. ఆ
జ్ఞానం స్వచ్ఛం నిర్మలం కాగానే ఆత్మ అందులో భాసిస్తుంది.
10.
యం యం లోకం మనసా సంవిభాతి
విశుద్ధసత్త్వ:
కామయతే యాంశ్చ కామాన్ !
తం
తం లోకం జయతే తాంశ్చ కామాం -
స్తస్మాద్
ఆత్మజ్ఞం హ్యర్చయేద్ భూతికామా: !!
భావం : శుద్ధసత్త్వుడు ఏ
లోకంపై మనసుపడినా, ఏ కోరికలు కోరినా అవి అతనికి తక్షణమే సిద్ధిస్తాయి. కాబట్టి
లోకంలో సంపన్నుడు కాదలచినవాడు ఆత్మజ్ఞానిని ఆరాధించాలి.
(ఇది తృతీయ ముండకంలో మొదటి ఖండం)
ద్వితీయ ఖండం :
1.
స వేదౌతత్ పరమం బ్రహ్మ ధామ యత్రం విశ్వం
నిహితం భాతి శుభ్రమ్ !
ఉపాసతే
పురుషం యే హ్యకామాస్తే శుక్రమేతదతివర్తంతి ధీరా: !!
భావం : ఆత్మసాక్షాత్కారం
పొందినవాడు ఉజ్జ్వలమై ప్రకాశించేది,
సకల జగత్తుకు ఆధారమైనది అయిన
బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు. అటువంటి పురుషుని పట్ల నిష్కాములై
శ్రద్ధాళువులైనవారు పునర్జన్మ బాధను దాటిపోతారు.
2.
కామాన్య: కామయతే మన్యమాన:
స
కామభిర్జాయతే తత్ర తత్ర !
పర్యాప్తకామస్య
కృతాత్మనస్తు
ఇహైవ
సర్వే ప్రవిలీయంతి కామా: !!
భావం : ఇంద్రియా భోగాలను
పదేపదే తలుచుకుంటూ వాటికోసం ఆరాటపడేవాళ్లు,
ఆ కోరికలు తీరడానికిగాను అక్కడక్కడ జన్మలెత్తుతారు. కాని ఆత్మ లాభం పొంది అన్ని కోరికలను ఆత్మలో
నేలయం చేసిన ధన్యుడికి ఈ జన్మలోనే అన్ని కోరికలూ అదృశ్యమైపోతాయి.
3.
నాయమాత్మా ప్రవచనేన లభ్యో
న
మేధయా న బహునా శ్రుతేన
యమేవైష
వృణుతే తేన లభ్య
స్వస్యైష
ఆత్మా వివృణుతే తనుం స్వామ్ !!
భావం : గొప్ప ఉపన్యాసాలు
ఇవ్వడంవల్లగాని, చాలా శాస్త్రాలు అధ్యయనం చేయడంవల్లగాని, ఎన్నో గూఢార్థాలు
మహాత్ములవద్ద వినడంవల్లగాని ఆత్మప్రాప్తి జరగదు. ఆ ఆత్మకోసం హృదయపూర్వకంగా
ఆరాటపడి మన నిధి ధ్యాస చేసే వ్యక్తికే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది.
అట్టి వ్యక్తికే ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది.
4.
నాయమాత్మ బలహీనేన లభ్యో
నచ
ప్రమాదాత్ తపసో వాప్యలింగాత్ !
ఏతైరుపాయైర్యతతే
యస్తు విద్వాం
స్తస్యైష
ఆత్మా విశతే బ్రహ్మధామ !!
భావం : ఆత్మ మనోబలం
లేనివారికి, అజాగ్రత్తపరులకు,
శాస్త్రవిరుద్ధమైన తపస్సులు చేసేవారికి
లభించదు. అయితే దృఢంగా శ్రద్ధ వుంచి తగిన విధంగా ప్రయత్నించే వారి ఆత్మ బ్రహ్మ
పదంతో ఐక్యం పొందగలదు.
5.
సంప్రాప్యైనమృషయో జ్ఞానతృప్తా:
కృతాత్మానో
వీతరాగా: ప్రశాన్తా: !
తే
సర్వగం సర్వత: ప్రాప్యధీరా
యుక్తాత్మాన:
సర్వమేవా విశన్తి !!
భావం : ఆత్మలాభం పొందిన
రుషులు ఆత్మజ్ఞానంతో సంతుష్టులవుతారు. ఇక వారికి కావలసిందేమీ లేదు. వారు పరమాత్మస్వరూపులు, సంగరహితులు శమించిన
ఇంద్రియాలు కలవారు. సర్వవ్యాపియైన బ్రహ్మాన్ని ఎల్లెడల సాక్షాత్కరించుకొని
ప్రాజ్ఞులైన ఆ వినీతమతులు అన్నింటా ప్రవేశిస్తారు.
6.
వేదాంతవిజ్ఞాన సునిశ్చితార్థా:
సన్న్యాసయోగాద్
యతయ: శుద్ధసత్త్వా: !
తే
బ్రహ్మలోకేషు పరాన్తకాలే
పరామృతా:
పరిముచ్యంతి సర్వే !!
భావం : వైరాగ్యమైన జీవనం
ద్వారా, నిరంతరాభ్యాసం ద్వారా పవిత్రస్వభావులై, వేదవేదాంతాలు
అన్వేషించే పరమాత్మయందే సుస్థిరులైన సాధకులు సాక్షాత్కార సమయంలో అమరులై బ్రహ్మీభూతులవుతారు. అన్నివిధాలా ముక్తులవుతారు.
7.
గతా: కలా: పంచదశ ప్రతిష్ఠా
దేవాశ్చ
సర్వే ప్రతిదేవతాసు !
కర్మాణి
విజ్ఞానమయశ్చ ఆత్మా
పరే
వ్యయే సర్వ ఏకీభవన్తి !!
భావం : వారి పదిహేను అంశాలు
వాటి స్థావరాల్లోకి చేరిపోతాయి. ఇంద్రియాలు వాటివాటి అధిదేవతలలో
లీనమవుతాయి. వారి కర్మలు, జీవాత్మపరమైన అక్షయతత్త్వంలో ఐక్యమవుతాయి.
8.
యథా నద్య: స్వందమానా: సముద్రే
స్తం
గచ్ఛంతి నామరూపే విహాయ !
తథా
విద్వాన్నామరూపాద్విముక్త:
పరాత్పరం
పురుషముపైతి దివ్యం !!
భావం : ప్రవహించే నదులు వాటి
పేర్లను, ఆకారాలను కోల్పోయి ఎలా సముద్రంలో ఏకమవుతాయో.. అలాగే జ్ఞానికూడా
తన నామరూపాల నుండి ముక్తుడై సర్వోత్కృష్టం దీప్యమానం ఐన పరబ్రహ్మతత్త్వంలో లీనమవుతాడు.
9.
స యో హ వై తత్పరమం బ్రహ్మవేద
బ్రహ్మైవ
భవతి నాస్య అబ్రహ్మవిత్కులే భవతి !
తరతి
శోకం తరతి పాప్మానం
గుహాగ్రన్థిభ్యో
విముక్తో మృతో భవతి !!
భావం : ఆ పరబ్రహ్మ
తత్త్వాన్ని తెలుసుకున్న ప్రతివాడు పరబ్రహ్మమే అవుతాడు. బ్రహ్మవిదుడు కానివాడు అతని
వంశంలో జన్మించడు. హృదయగ్రంథులు కరిగిపోగా అతడు శోకపాపాలకు అతీతుడై
శాశ్వతమైన అమరత్వాన్ని అందుకుంటాడు.
10.
క్రియావన్త: శ్రోత్రియా బ్రహ్మనిష్ఠా:
స్వయం
జుహ్వత ఏకర్షిం శ్రద్ధయన్త: !
తేషామేవైషాం
బ్రహ్మవిద్యాం వదేత
శిరోవ్రతం
విధివద్యైస్తు చీర్ణమ్ !!
భావం : ఈ సిద్ధాంతమే క్రింది
వేదమంత్రంలో చెప్పబడింది. కర్మనిష్ఠులకు వేదపారంగతులకు బ్రహ్మను
ఉపాసించేవారికి శ్రద్ధావంతులకు ఏకర్షి అనే అగ్నికి ఆహుతులిచ్చే వారికి
శాస్త్రోకంగా శిరోవ్రతాన్ని అనుష్ఠించిన వారికి మాత్రమే ఈ బ్రహ్మవిద్యను
ఉపదేశించాలి.
11.
తదేతత్ సత్యమృషిరంగిరా:
పురోవాచ
నైతద చీర్ణవ్రతో ధీతే !
నమ:
పరమ ఋషిభ్యో
నమ:
పరమ ఋషిభ్యో: !!
భావం : ఇదే పరమసత్యం. ఈ
సత్యాన్నే ప్రాచీనకాలంలో ఆంగిరసుడు తన శిష్యులకు ఉపదేశించాడు. ఏ
వ్రతాన్ని అనుష్ఠించినవాడు దీన్ని అధ్యయనం చేయరాదు. మహాఋషులారా! మీకు
నమస్సులు... మహాఋషులారా! మీకు నమస్సులు.
(ఇది మూడవల ముండకంలోని ద్వితీయ ఖండం)
# ఇంతటితో ముండక ఉపనిషత్తు సమాప్తం #