హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Monday, March 18, 2013

హైందవ సాధనారాధన

                                     హైందవ  సాధనారాధన                                           P.V.RADHAKRISHNA (PARAKRI ) CELL -   9966455872
    
శో||   ఓం గణేశ  గ్రహనక్షత్రాణి యోగినీ రాశిరూపిణీం |
       దేవీం మంత్ర మయీం నౌమి మాతృకాం పరమేశ్వరీం ||

           ప్రణవనాదము  "ఓం
" కార రూపమై  గణ,ఈశ,గ్రహ,నక్షత్ర,రాశి, యోగినీ రూపమున  మరియు మంత్ర , తంత్ర రూపమున ఏ మహత్తర శక్తి జగత్తునందంతటా మాతృకా రూపమై ఏకమనేక అగుచు పూర్ణమైనిండి యున్నదో ఆ పరమేశ్వరికి నమస్కరించుచున్నాను.
 ఉ||   ఏమహనీయ శక్తి పరమేశ్వర బ్రహ్మముకుందులందు తా
       సాముగ వర్తిలింగ పృధుశక్తి చరాచర విశ్వ వృత్తి సం
       గ్రామ లయంబు సృష్టి పరి రక్షణ లొప్పగ వారు జేతురో . . . ?
       నీమము తోడ నామె భువనేశ్వరి నే శరణంబు వేడెదన్ ||    ( స్వకీయము )

      దైవీయ భావ చరిత్ర :-    మానవావిర్భావముతో సమాంతరంగానే దైవీయభావము ఆవిర్భవించింది. చరిత్ర పుటల్లో మానవేతిహాసపు జాడలు తెలియవచ్చే నాటికే దైవీయభావ చరిత్ర ప్రాధమిక ప్రకరణాలు పూర్తిచేసుకుంది. పచ్చని చెట్లు... పరిమళించే పూలు, విరిసిన వెన్నెల, మేఘ మాలికల మాటున తళుక్కున మెరిసే మెరుపులు, చిక్కని చీకట్లో ఆశారేఖల్లా మిలమిల మెరిసే నక్షత్రాలు,ఇలా ఎన్నో ప్రకృతి మనోహర దృశ్యాలు అలనాటి ఆదిమానవుని- ఆహ్లాద పరచాయి-ఆశ్చర్య పరిచాయి. పరిశీలింప ఆలోచింపజేసాయి. ఊహ తెలిసిన మానవుడు ఉత్సాహవంతంగా నాటినుండి నేటి వరకు... ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ ప్రకృతి ఇలా క్రమ బద్ధంగా ఎలా ఉంది.   
  
   మండే ఎండలు,వడగాడ్పులు,పెను తుఫానులు,వానలు-వరదలు,భూకంపాలుఇలాంటి ప్రకృతి భీభత్సాలు మానవజాతిని భయకంపిత విహ్వలుని చేస్తూనే ఉన్నాయి. మొదట ప్రకృతి అందాలకు పులకించాడు ఆనందించాడు, ప్రకృతి ప్రసాదిత వస్తుసంచయ సమృద్ధికి గర్వించాడు.ప్రకృతి ప్రళయ కరాళా విలయాలకు నశించాడు కృశించాడు.ఎన్నో ఉత్పాతాలనుండి తాను రక్షణ పొందాలనే తలంపుతో ఏ కొద్ది సాధన చేసినా తన ఆలోచనామృతానికి పరవసిస్తూ సుఖించాడు. తన ఆలోచనలే పరిశీలనలకుపునాదిరాళ్ళుగా ప్రకృతినించి తెలుసుకుని వికృతిని కల్పించుకుని మురిసిపోయాడు. అదిగో ఆ ఆలోచనా భావ స్రవంతిలో భౌతిక సుఖవాదము-దైవీయభావము కవల పిల్లల్లా జన్మించాయి.
                 
                    ప్రకృతి ప్రసాదిత వస్తులోహ సంచయముతో శీతోష్ణాదులనుండి రక్షించుకుని పర్ణశాలనుండి పదంతస్థుల భవనం వరకు నిర్మించుకునే సామర్ధ్యాన్ని పెంపొందించుకున్నాడు. మరో మాటలో చెప్పాలంటే ప్రకృతి ప్రసాదిత వస్తు సంచయానికి--- స్థల-కాల-రూపోపయుక్తత కల్పించుకోవడామే మానవ విఙ్ఞానం భౌతికశాస్త్రంగా పరిఢవిల్లింది. శాస్త్రాన్వేషణా ధ్యేయం ప్రకృతి నుండి తనను తాను కాపాడుకోవడం,రక్షణ పొందడం,సుఖానుభూతి పొందడమే.ఐతే గొప్ప తిరకాసంతా ఇక్కడే ఉంది.ఆకలిబాధకి తట్టుకోలేక తిన్నాడు,దాహపు బాధకి తట్టుకోలేక తాగాడు, శారీరక సౌఖ్యాలకై తహతహపడి స్త్రీ పురుషులు సంగమించారు.బాధానివారణమే సౌఖ్యమని భ్రమించారు.భౌతిక వాదము ఇచ్చే సుఖము ఆధ్యాత్మిక వాదుల అంతరంగము వేరువేరై పేరుకున్న అభిప్రాయాల బేధాన్ని కల్పించాయి.మరి ఆధ్యాత్మికవాదుల భావనచూస్తే........
                     
                            ఈ ప్రకృతి ఇలా లయబద్ధంగా ఎందుకు నడుస్తోంది? దీనిని ఇలా నడిపిస్తున్న అదృశ్య శక్తి ఏది? భౌతిక శాస్త్రాలు ఎంత అభివృద్ధి పరుచుకున్న కాల పరిధిలో అవిఅరిగి విరిగి పోతున్నాయి.భౌతికశాస్త్ర వస్తు సంచయంతో పొందలేని రక్షణ ఆ అదృశ్యశక్తి నుండిపొందగలగాలని పరిశీలింప కృషిచేసారు.అదే దైవీయ భావనకు అంకురార్పణ అయ్యింది.                 
       మానవ చరిత్రలో పలుమార్లు భౌతిక-ఆధ్యాత్మిక వాదాలు తమదే పైచేయంటూ పరుగు పందాలు తీసాయి.ఈ దైవీయ భావమే పలు దేశాల్లో అనేక మతాలుగా వెల్లివిరిసింది.కాబట్టే మానవ చరిత్రలో మతం కూడా అనేక కల్లోలాలుసృష్టించింది.రాజ్యాల స్థాపనలో మత యుద్ధాలు,కులాల కుమ్ములాటాలు కోకొల్లలు.చరిత్ర ఇలా ఎంత కాలమైనా అనంతంగా సాగుతునే ఉంటుంది.
హిందూమతం - ఓ పరిశీలన :-  ఆరాధన అంటే? తాను నమ్మిన దైవాన్ని ప్రేమించడమే, ప్రేమించి సేవించడమే. దీనిచే భక్తి,విశ్వాసము,సేవానిరతి,మనోవికాశము కలుగుతాయి.

శ్లో ||   స్త్రీ రూపం చింతయేత్ దేవీం - పుం రూపంవా విచింతయేత్ |
       అధవా నిష్కళం ధ్యాయేత్ - సచ్చిదానంద లక్షణమ్||                          
         ఆకార,వికార,విచార,విదూరము-లింగ,పురుష,వచన,విభక్తిఅభేధ్యము అగునది భగవత్ స్వరూపము. అట్టి సచ్చిదానందమూర్తి (భూమ) శబ్దోక్తము. నిరాకార సచ్చిదానంద స్వరూపముగా విరాట్ నర్చించుటయే మేలు అదే తపస్సు. దీనికి ఎంతో మనో ధృఢత్వము నిగ్రహము కావాలి కావున అందరూ తపస్సులు కాలేరు కదా.  
                  
         మనో నిగ్రహం సాధించడానికే విగ్రహారాధన పరికల్పితమైనది. ఏ రూపూ చేని దేవునకు అనేక రూపములు, ఏ పేరూ లేని దేవునికి శతకోటి నామములు. మరలా మధ్యలో మన సంకల్పములు,మన కాల్పనికతకు తగ్గట్టు ముక్కోటి దేవతా మూర్తులు. విఘ్నములు కలుగకుండా విఘ్నేశ్వరుని పూజలు,ధనము కావాలంటూ లక్ష్మీ కుబేరులను,ఇలా మన కోర్కెలకు అనువైన దేవతలకు అనువుగా సృజింపబడిన ఆగమోక్తములు. ఐనా ప్రకృతిలో గల అణువణువునూమన హైందవ సంప్రదాయము దైవముగనే తలచినది.నమక చమక రుద్ర సూక్తములుసైతము పై భావనను ప్రకటించుచున్నవి.ఒక్క మాటలో చెప్పాలంటే హైందవ జీవన శైలిలో మిళితమై ఆధ్యాత్మికా
భావము సర్వ పల్లవ పులకితము. మన్మతః సమ్మతః తత్ మతః అను భావముతో అనేక బోద్ధలు అనుయాయులు హైందవ ధర్మమున గలరు.హిందూ మతము అనుట
తప్పు. హైందవ దేశమున ఎన్నియో మతములవారు తమ భావజాల సంచయమును యుగధర్మానుసారము మనుగడింప జేసిరి.
   మ||  ధన తంత్రమ్మున గణ్యతన్ బడయగా తంత్రఙ్ఞుడన్ గాను, క
        మ్మని మంత్రమ్ముల భక్తితో గొలువగా మంత్రఙ్ఞుడన్ గాను, నూ
        తన యంత్రమ్ముల నిన్ను జేర జన శాస్త్రఙ్ఞుండనే గాను, నీ   
         యను రాగాంబుధి ముంచి తేల్చగదవో? అఙ్ఞుండ నన్ బ్రోవవో?  (స్వకీయము)

             శ్లో//  నిర్గుణా సగుణా శ్చేతి - ద్వివిధా ప్రోక్తమనీషిభిః /
                   సగుణారాగి భిస్సేవ్యా - నిర్గుణాతు విరాగిభిః //
       కామ్యులగు మానవులు సగుణ రూపమున, నిష్కాములు నిర్గుణ రూపమున
భగవంతుని సేవించుచున్నారు. కామ్యాకామ్య సంకల్పమే కర్మ ముక్తి మార్గ ప్రేరకమై యున్నది.
వివిధారాధలు:-  ౧. మనస్సున స్థిర సంకల్పముతో విశ్వసించుట మానసిక ఆరాధము.ఇందు భౌతికవస్తుచయము అనగా ధూప, దీప, నైవేద్యాదికములు నామమాత్రములు.
౨, వాక్కు:- భగవన్నామమును నోటితో పలుకుట భజించుట వాక్కు.ఈ ప్రక్రియనందు భజన,కీర్తన,మంత్రజపాదులు ప్రాధాన్యత వహించును.
౩. కాయము:- శరీరావయవములు కదల్చి, యోని ముద్రాదుల దాల్చి, ధూపదీప నైవేద్యములర్పించి జపతప హోమాదులు చేయుట ప్రాధాన్యత వహించును.
౪.కర్మలు:- పూజ,జపము,హోమము,తర్పణము,మార్జనము,బ్రాహ్మణ భోజనాదులనే షడంగములు  నిర్వర్తించుట ప్రధానమై యుండును.  మనోవాక్కాయ కర్మంబుల ప్రబల విశ్వాసముతో తాను నమ్మిన దైవమును కొల్చుటయే ఆరాధన.

     ఉ||   శ్రీగిరిజా సరస్వతుల చిన్మయరూపిణి లోకమాతకున్
           రాగిణి విష్ణు చేతనకు రాసవిలాస విహారలోలకున్
           భాగవిభాగ రాశినత భాసిత సర్వగ్రహాది మూర్తికిన్
           సాగిలి మ్రొక్కెదన్  జయము సౌఖ్యము గూర్పగ విశ్వశక్తికిన్ || (స్వకీయము)

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...