హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

సోమవారం, మార్చి 21, 2016

శ్రీ కాళహస్తి



శ్రీ కాళహస్తి:

తిరుపతికి తూర్పున సువర్ణముఖి నది ఒడ్డున గల కొండల మధ్య అమరివున్నది శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం.

నామ సార్ధకత:
శ్రీ అనగా సాలెపురుగు, కాళము అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ ప్రాంతంలో స్వయం భూలింగముగా వెలసిన శివలింగం పై మూడున్నూ అర్చించి భక్తి నిరూపణలో పోటాపోటీగా సంచరించి చివరికి మోక్షమును పొందాయని ఒక కథ. కనుకనే ఈ స్వామి శ్రీ కాళ హస్తీశ్వరుడనేది సార్ధకనామంగా వున్నదని ప్రతీతి. మరో విశేషం ఏమిటంటే భక్తకన్నప్ప చరిత్ర కూడా ఇచ్చోటనే జరిగి భక్తిలోని గొప్పదనాన్ని చాటిన దివ్య ప్రదేశంగా పేరొందింది. ఈ స్వామి మహత్యాన్ని ఉగ్గడిస్తూ శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకరైన మధురకవి దూర్జటి శ్రీ కాళ హస్తీశ్వర శతకంగా రూపొందించి ధన్యతను పొందాడు, చిరస్మరణీయుడైనాడు. 

క్షేత్ర వైభవం:
పెద్ద పెద్ద ప్రాకారాలు గలిగిన ఆలయం రమణీయమైన శిల్ప చమత్కృతులతో విలసిల్లుతున్న ఈ ఆలయం పురాతన వైభవానికి ప్రతీకగా నిలిచిందనటంలో సందేహం లేదు. ఇక్కడగల కొండల మీద కూడ కొన్ని ఆలయాలున్నాయి. మహాశివరాత్రికి స్వామివారికి ఉత్సవ విశేషాదులు బహుధా జరుగుతుంటాయి. చుట్టు ప్రక్కలనున్న గ్రామాలనుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చి స్వామిని దర్శించి పోతుంటారు. ఇక్కడే శ్రీ శ్రీ శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాములవారి పవిత్రాశ్రమం నెలకొని వుంది. ఆయన ఒక సిద్ధ యోగి. స్వామివారి బోధనలు అమృత తుల్యములు. చాల ప్రసిద్ధము.

సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభువు లింగము, లింగమున కెదురుగా వున్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని 'దక్షిణ కాశీ ' అని అంటారు. శ్రీ కాళ హస్తి తిరుపతికి సుమరు నలబై కిలోమీటర్ల దూరంలో వున్నది. అన్ని విదాల రవాణ సౌకర్యాలున్నవి.

ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ , అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్టుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మం వ్రాసిన దూర్జటి) వంటి వారి కధలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి.

కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు . అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చేడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి వారికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడ నెత్తురు కారటం మొదలయింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు. ఈ దేవాలయము చాలా పెద్దది, పై కప్పుపై రంగులతో చిత్రించిన అనేకము లయిన చిత్రములు వున్నాయి. " మణికుండేశ్వరాఖ్య " అనే మందిరమువున్నది. కాశీ క్షేత్రములో వలె ఇక్కడ చనిపొయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారక మంత్రమును ఉపదేశించి మోక్షము ఇచ్చునని భక్తుల నమ్మకము. దేవాలయ ప్రాంతములోనే పాతాళ విఘ్నేశ్వరాలయము కలదు. దేవాలయమునకు సమీపములో గల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయము నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయము రాజగోపురము యొక్క సింహద్వారము దక్షిణాభిముఖము. స్వామి వారు ఉత్తరాభిముఖులై వుంటారు. ఆదిశంకరులు ఇక్కడ శ్రీ చక్రము స్థాపించారు. ఈ క్షేత్రమునకు గల ఇతర నామములు దక్షిణకైలాస మనియు, సత్య మహా భాస్కరక్షేత్ర మనియు , సద్యోముక్తి క్షేత్రమనియు, శివానందైక నిలయమనియు పేర్కొనటం జరిగింది. మహా శివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ రాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను మరియు నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. క్రీస్తుశకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన వంద స్థంభాలు కలిగిన మంటపం మరియు అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516 వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురం మే 26, 2010 న కూలిపోయింది.

క్రీస్తుశకం 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపు కొన్నాడు. 1912లో దేవకోట్టై కి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు తొమ్మిది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుది రూపునిచ్చారు. ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు బయట వున్న కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. 

నాలుగు దిక్కుల దేవుళ్ళు:
శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖుని గాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు)గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. (కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగము, చిదంబరంలో ఆకాశలింగము). స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు. 

గోపురాలు:
ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు, మరియు 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం (కృష్ణదేరాయలు కట్టించినది) ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురంనుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా "తేరు వీధి"కి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురంనుండి వస్తాడు. జంగమ రూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి "బిచ్చాలు" దీనిని కట్టించిందట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్ప గోపురాన్ని "బాల జ్ఞానాంబి గోపురం" అని, ఉత్తరం గోపురాన్ని "శివయ్య గోపురం" అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని "తిరుమంజన గోపురం" అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడినైపున "సూర్య పుష్కరిణి", ఎడమవైపున "చంద్ర పుష్కరిణి" ఉన్నాయి. స్వామి అభిషేకానికి, వంటకు నీటిని సూర్యపుష్కరిణి నుండి తీసుకెళతారు. ఈ గోపురంనుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణం గోపురంనుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మ గుడికి వెళ్ళవచ్చును.

రాహు కేతు క్షేత్రము:
ఇది రాహు కేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గరైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి "రాహు కేతు క్షేత్రము" అని పేరు వచ్చింది. సర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషాలనుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు.

దక్షిణామూర్తి:
దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారంనుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువైయున్న దక్షిణామూర్తిని దర్శించవచ్చును. దక్షిణామూర్తి పూజలందు కొనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం వేరెక్కడా కనుపించదు. ఇక్కడ వైదిక సంప్రదాయానికి ప్రముఖస్థానం ఉంది.

ఆలయంలో జరిగే కొన్ని సేవలు - కర్పూర హారతి, అష్టోత్తర అర్చన, సహస్ర నామార్చన, త్రిశతి అర్చన, పాలాభిషేకము, పచ్చ కర్పూరాభిషేకము, కాశీ గంగాభిషేకము, రుద్రాభిషేకము, నిత్యదిట్ట అభిషేకము, శ్రీ శనేశ్వరస్వామి అభిషేకము, శుక్రవారం అమ్మవారి ఊంజలి సేవ, వివాహ కట్నం, పంచామృతాభిషేకము, అఖండ దీపారాధన కట్నం, నిత్యోత్సవం (ఉదయం), ప్రదోష నంది సేవ, ఏకాంత సేవ, వాహన పూజ, సుప్రభాత సేవ, శని నివారణ జ్యోతిదీప కట్నం, తళిగ కట్నం, సర్పదోష (రాహు కేతు) పూజ, పౌర్ణమినాడు ఊంజల్ సేవ, నంది సేవ, పెద్ద వెండి సింహ వాహనము.

తీర్ధాలు:
ఆలయం పరిసరాలలో 36 తీర్ధాలున్నాయట. సహస్ర లింగాల తీర్ధము, హరిహర తీర్ధము, భరద్వాజ తీర్ధము, మార్కండేయ తీర్ధము, మూక తీర్ధము, సూర్య చంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి. దేవాలయంలోని "పాతాళ గంగ" లేదా "మూక తీర్థము"లోని తీర్థాన్ని సేవిస్తే నత్తి, మూగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందటారు.

ఇతర విశేషాలు:
ధర్మ కర్తల మండలి పరిపాలనలో, దేవాదాయ శాఖ అధ్వర్యంలోఆలయ నిర్వహణ జరుగుతుంది. యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వరస్వామి వసతి గృహం, జ్ఞానప్రసూనాంబ వసతి గృహం, బాలజ్ఞానాంబ సత్రము, శంకరముని వసతిగృహము, త్రినేత్రనటరాజ వసతిగృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహము ఉన్నాయి. పట్టణంలో ప్రైవేటు వసతిగృహాలున్నాయి. (2007 నాటికి) దేవస్థానానికి ఆదాయం షుమారు 7 కోట్ల రూపాయలు ఉంది. శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నిత్యాన్నదాన పధకం ద్వారా భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కలిగించే ప్రయత్నం జరుగుతున్నది.

బుధవారం, మార్చి 16, 2016

మహానంది



మహానంది:

మహానంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రము మహానంది ఆలయము 

నంద్యాల కు 14 కి.మీ దూరంలో ఉన్నది ఈ మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7 వ శతాబ్ధినాటిది. ఇచ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము తప్పటగ వుంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కి నందు వలన లింగము కొంచెము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట శుద్ధ స్పటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత. ఇక్కడి పుష్కరిణి నీరు అమృతం వలె ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఆలయ ముఖ ద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్చమైన నీరు సర్వ వేళలా గోముఖ శిల న్నుండి దారా వాహకంగా వస్తుంటుంది. ఆ నీరు ఎక్కడి నుండి వస్తున్నది ఎవరికి తెలియదు. ఆ నీరు పుష్కరిణిలోనె బయటకు కనబడు తుంది. ప్రధాన ఆలయం క్రింది బాగంనుండి వస్తుంటుంది. ఆలయం వెనుక పెద్ద కొండ వున్నది. అక్కడ జలపాతమేమి లేదు. బహుశ కొండ క్రింది బాగం నుండి ఊట వస్తుండొచ్చు. ఇలాంటి ఊట బుగ్గలు ఈ ప్రాంతంలో చాలానె వున్నాయి. ఈ నీరు ఎంత స్వచ్చంగా వుంటుందంటే నీటి పై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఐదు అడుగులు లోతున్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాల స్పష్టంగా కనబడుతుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వార బయటకు పారుతుంది. నిరంతరంగా ప్రవహిస్తున్నందున నీరు ఎల్లప్పుడు పరిశుబ్రంగా వుంటుంది. ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి. అన్నింటిలోను ఇలాంటి నీరె వున్నది. ఈ నీటిని తీర్తంగా భక్తులు తీసుకెళతారు. ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు కలవు. లింగము క్రింద నుండి నీరు ఊరుతూ వుంటుంది. మహాశివరాత్రి పుణ్యదినమున లింగోధ్బవసమయమున అభిషేకము, కళ్యాణోత్సవము, రధోత్సవములు జరుగుతాయి. కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కలదు. అదేమంటే..... గర్బాలయానికి ప్రక్కన ఒక శిలా మండపం కలదు. అది నవీన కాలంలో చెక్కిన శిల్పాలు. ఆ శిలా స్థంబాలపై ఆ శిల్పి తల్లి తండ్రుల శిల్పాలు చెక్కి తల్లి దండ్రుల పై తనకున్న భక్తిని చాటుకున్నాడు. అదే విధంగా స్థంబాలపై, గాంధి మహాత్ముని ప్రతిమ, ఇందిరా గాంధి ప్రతిమ, జవహర్ లాల్ నెహ్రూ ప్రతిమలను చెక్కి తనకున్న దేశ భక్తిని చాటుకున్నాడు. ఈ మహనంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3000 ఏకరాలకు సాగు నీరు అందజేస్తుంది. నంద్యాల నుండి ప్రతి అర్ద గంటకు ఒక బస్ కలదు. 

గిద్దలూరు నుండి గాజులపల్లి స్టేషనులోదిగి వెళ్ళవచ్చు. గాజులపల్లికి సుమారు 6 కి.మీటర్లుంటుంది, మహానంది. ఇది కూడా పేరెన్నికగన్న శైవక్షేత్రాల్లో ఒకటి. నంధ్యాల నుండి 16 కిలోమీటర్లుంటుంది. ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్. 

ఇక్కడ మహానందీశ్వరాలయం - ఆలయానికెదురుగా కోనేరు. కోనేరులోకి నీరు ఒకనంది నోటిగుండా నిరంతరం ప్రవహిస్తూనే వుంటుంది. చాలా తేలికై నీరు స్వచ్ఛంగా వుంటుంది. కోనేరు సుమారు 6 అడుగుల లోతుంటుంది. నీటి అడుగున ఎంత చిన్న వస్తువైనాసరే స్పష్టంగా పైకి కనబడుతుంది. కోనేటి నీటిమట్టం ఒకే విధంగా వుండటానికి కొన్ని తూములు కట్టబడినాయి. నీరంతా కాలువలద్వారా కొన్ని వందల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేస్తూ విస్తారంగా అరటి తోటలు పెంచటానికి ఉపయోగపడుతుంది. ఇక్కడి అరటిపండ్లు చాల ప్రసిద్ధం. తిరిగి నంద్యాల వచ్చి అక్కడినుండి శ్రీశైలమునకు రావచ్చును.

మంగళవారం, మార్చి 15, 2016

అమరావతి.. అమరలింగేశ్వర స్వామి: గుంటూరు జిల్లా



అమరావతి.. అమరలింగేశ్వర స్వామి: గుంటూరు జిల్లా:

గుంటూరు నుండి 27 కి. మీ వున్న అమరావతికి ప్రతి అరగంటకు బస్సులు తిరుగుతూవుంటాయి. ఇక్కడ ఒకనాడు బౌద్ధులు శివుడు విశ్వవిద్యాలయాలు స్థాపించి, మహొన్నతమైన చరిత్ర సృష్టించారు. విశ్వవిఖ్యాతిని వెలయించారు. ఆనాటి వైభవాలు చిహ్నాలు చరిత్రలో ఈ నాటికి సాక్ష్యం పలుకుతున్నాయి. పంచారామాలయిన అమరారామము, కొమరారామము, భీమారామము, ద్రాక్షారామము, క్షీరారామములలో మొదటిది. పావన కృష్ణా నదీ తీరమున నెలకొనియున్న ఈ క్షేత్రము క్రీస్తు పూర్వ కాలమునుండి సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రముగా పేరుగాంచి యున్నది. ఇక్కడి ప్రాచీన బౌద్ధ స్థూపములు, శిల్పములు లెక్కకు మిక్కుటంగా వుండి పూర్వపు ఔన్నత్యమును చాటుతూ శిల్ప కళా విశేషములను ప్రస్ఫుటిస్తుంది. ఇది శాతవాహనుల కాలం నాటి వరకూ ఒక గొప్ప రాజధాని నగరంగా అభివృద్ధి చెందిన చిహ్నాలు కనబడుతున్నాయి.

క్షేత్ర వైభవం:
ఇక్కడ ముఖ్యంగా చూడదగినది అమరేశ్వరాలయము. వెలసిన దేవుడు అమరేశ్వరస్వామి. దేవేరి రాజ్యలక్ష్మి అమ్మవారు. పంచ ప్రాకారాలు మధ్య ఆలయం ఎత్తుగ నిర్మించబడింది. ఇక్కడ లింగము సుమారు 15 అడుగులు ఎత్తున వుంటుంది. 3 అడుగుల కై వారంతో తెల్లగా వుంటుంది. ఈ లింగమును గూర్చి ఒక వింత ప్రచారంలో ఉంది. ఈ శివలింగము దినదినము పెరుగుతూందనిన్నీ, ఆలయం ఎంత పెంచినప్పటికీ చాలక పోవటంతో ఆలయ నిర్మాతలు లింగము పెరగకుండా నివారించాలనే ఉద్దేశ్యంతో లింగము నెత్తి పై ఒక మేకుని కొట్టారని - అంతటితో పెరుగుదల ఆగిందని సమాచారం. దీన్ని ఋజువు పరస్తున్నట్లుగా - లింగం చాలా ఎత్తుగా ఉండి నెత్తి పైన మేకు - మేకు కొట్టినపుడు స్రవించిన రుధిర ధారల చారలు - గుర్తులున్నాయి. స్వామికి అభిషేకము చేయాలన్నా పైకెక్కి వెళ్ళి చేయాల్సివుంది. 

ఈ అమరావతికి ఒక పురాణ కథ కూడా వుంది. దేవేంద్రుడు అహల్యా జారుడై తత్పాప పరిహారార్ధం ఇక్కడ శివలింగమును ప్రతిష్ఠించాడని దేవతల ప్రభువైన సురేంద్రుని చేత ప్రతిష్టించబడినది గాబట్టి ' అమరావతి ' నామము సార్ధకంగా ప్రసిద్ధమయినది అని అంటారు. 

ఇక్కడ దగ్గరిలోనే దీపాల తిన్నె అనే ప్రదేశం వుంది. బౌద్ధ విగ్రహాలు, స్థూపాలు గలిగిన చోటు. ఇది ఆర్కిలాజికల్ డిపార్టుమెంటు వారు ఆనాటి ఔన్నత్యపు చిహ్నాలను తమ అధీనంలో వుంచుకుని ప్రాచీన కళా సంపదను కాపాడుతూ ఉన్నారు. చరిత్ర అధ్యయన పరులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటాయి.

ఇది శైవ క్షేత్రము. గుంటూరు జిల్లాలొ వున్న అమరావతి పట్టణంలో కృష్ణానది తీరాన వున్నది ఈ ఆలయము. ఈ ఆలయంలో కొలువు దీరిన దేవుడు అమరలింగేశ్వర స్వామి. ఈ శివాలయము ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాలలో ఇది ఒకటి. శ్రీకృష్ణదేవరాయలు అమరావతిని సందర్శించి ఇక్కడి అమరేశ్వరునికి నైవేద్య మహాపూజలు నిర్వహించినట్టు, పెదమద్దూరు గ్రామ పంటభూముల్ని ఆలయానికి దానమిచ్చినట్టుగా ఇక్కడ ఉన్న రాజశాసనం తేటతెల్లం చేస్తోంది. కొండవీటి రెడ్డిరాజులపై విజయానంతరం 1517లో చారిత్రక ప్రాంతం కృష్ణాతీరమైన అమరావతిని దర్శించిన కృష్ణదేవరాయలు ఇక్కడ తులాభారం తూగారు. తన బరువుతో సరిసమానమైన బంగారాన్ని పేదలకు పంచిపెట్టినట్టుగా శాసనంలో ఉంది. అందుకు గుర్తుగా రాయలు నిర్మించిన తులాభార మండపం, దానిముందు వేయించిన శాసనం నేటికీ ఇక్కడ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆలయంలోని దక్షిణ రెండో ప్రాకారంలో ఈ మండపం ఉంది. నేడు అమరావతి అమరేశ్వరునిగా కొలువందు కుంటున్న స్వామి నాడు ధరణికోట అమరేశ్వరస్వామిగా వెలుగొందాడని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. రాయలు తన భార్య చిన్నాదేవి చేత కృష్ణవేణీ తీరాన రత్నధేను మహాదానం, తిరుమల దేవి చేత సప్తసాగర మహాదానం చేయించి నట్టుగా ఇందులో రాసి ఉంది. స్థానికంగా ఉన్న ఇతర విశేషాలు.

అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధాని యైన ధాన్యకటకం. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. బౌద్ధమత చరిత్రలో ధాన్యకటకానిది ప్రముఖ స్థానం. ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకు రాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్ర దుర్గాలలో ఈ నగరమొకటి. సుమారు 16 కి.మీ చుట్టుకొలత కలిగిన మహానగరం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4 - 3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపదం)గా ఉన్నట్టు అధారాలున్నాయి. బుద్ధుని జీవితకాలము నుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగున పడిన చైత్య ప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. దీపాలదిన్నె గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ. అప్పటికే మహాచైత్యం అంతా కూలిపోయి 90 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తుగల ఒక దిబ్బలాగా మిగిలింది. అనేక విడతలుగా జరిగిన తవ్వకాలలో ఎన్నో విలువైన విగ్రహాలు, పరికరాలు మరియు ఇతర వస్తువులు దొరికాయి. ఈ త్రవ్వకాలను సర్ వాల్టర్ స్మిత్ 1845 లో, రాబర్ట్ సీవెల్ 1877 లో, జేమ్స్ బర్గెస్ 1881 లో మరియు అలక్జాండర్ రియ 1888-89 మధ్యలో చేపట్టారు. ఆఖరున జరిగిన తవ్వకాలలో ఈ చైత్య నిర్మాణానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నివసించిన మెగాలిథ్స్ కి సంబంధించిన అవశేషాలు కూడా దొరికాయి. ఇక్కడ దొరికిన శిల్పాలలో ఎక్కువ మద్రాస్ గవర్నమెంట్ మ్యూజియం, చెన్నై మరియు బ్రిటిష్ మ్యూజియం, లండన్ లలో భద్రపరిచారు. ధాన్యకటకంలో 1962-65 మధ్యలో యమ్. వెంకటరామయ్య మరియు కె.రాఘవాచారి ల అధ్వర్యంలో త్రవ్వకాలు జరిగాయి. ఇందులో ఐదు కాలాలకు కి సంబంధించిన అధారాలు దొరికాయి. కార్బన్ డేటింగ్ ద్వారా ఈ పట్టణం క్రీ.పూ.5వ శతాబ్ధికి చెందిందని తెలిసింది.

అద్భుతమైన శిల్పకళతో అలరారే స్థూపంపై బుద్దుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. స్థూపంపై బ్రాహ్మీ లిపిలో శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్థూపం గురించి అప్పటి బ్రిటిషు పురాతత్వ పరిశోధకుడు ఫెర్గుసన్ ఇలా అన్నాడు: "కళావైదుష్యానికి సంబంధించి ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన కట్టడము". దీన్ని చెన్నై లోని ప్రభుత్వ ప్రదర్శనశాలలో భద్రపరచారు.

అఅమరావతికి అతి దగ్గర రైల్వే స్టేషన్ గుంటూరు. అక్కడ నుండి అమరావతికి బస్సు సర్వీసు ఉంది. వర్షాకాలంలో విజయవాడ నుండి లాంచిల ద్వారా కృష్ణానది పై ప్రయాణించి అమరావతి చేరవచ్చు. స్థూపం ఉండిన ప్రదేశం, భారతీయ పురాతత్వ సర్వేక్షణ వారి సంగ్రహాలయము మరియు అమరేశ్వర మందిరం ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.

సోమవారం, మార్చి 14, 2016

వేయి స్థంబాల గుడి..... వరంగల్లు



వేయి స్థంబాల గుడి..... వరంగల్లు:

11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన వేయి స్తంభాల గుడి వరంగల్ నుండి సుమారు 5 కి.మీ. దూరంలోనూ హనుమకొండ నగరం నడిబొడ్డున కలదు. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలొ నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగుబంగారమై కొలువైనాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అధ్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమైయున్న నందీశ్వని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యణ మంటపానికి మరియు ప్రధానాలయాలకు మధ్యన ఠీవీగా దర్శనమిస్తుంది.

ఉత్తర ప్రాకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్టుగా గాలికి రాలే పూవులు సువాసనలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు. ప్రధానాలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏక పీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. సజీవంగా గోచరమయ్యే నందీశ్వరుడినికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వార పాలకులుగా ఉన్నట్లుగా నిలచిన గజ శిల్పాలను దాటి సభామంటపంలోనికి వెళ్ళిన పిదప విఘ్నేశ్వరున్ని అర్చించి భక్తులు రుద్రేశ్వరున్ని దర్శిస్తారు. ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలచిన తీరు చూపరులను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం మరియు ప్రధానాలయాన్ని కలిపి మొత్తం వేయి స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి వేయి స్తంభాల దేవాలయమనే పేరు ప్రసిద్ధి. నీటి పాయపై ఇసుకతో నిర్మించిన పుణాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది.

ఆలయ వాయువ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి, నాగ ప్రతిమలు కొలువైనవి. ఆనాటి రహస్య సైనిక కార్య కలాపాలకొరకై ఓరుగల్లు కోట మరియు ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా దర్శించవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా మరియు రహస్య మార్గం ధ్వంసమైన కారణంగా ఈ ద్వారం ప్రస్తుతం మూసివేయడం జరిగినది.

మాఘ, శ్రావణ మరియు కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని నమ్మకం. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేశ నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలలో ఇసుక వెస్తే రాలనంతగా భక్త జన సందోహం రుద్రేశ్వరున్ని దర్షిస్తారు. మహన్యాస పుర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, శతసహస్ర దీపాలంకరణలు, నిత్యపూజలు, అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలరారే రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం దివ్యానుభూతిని మిగిలిస్తుందనడం నిస్సంశయం.

ఇంతటి ప్రశస్థి కల ఈ ఆలయానికి దూరప్రాంతాల వారు ఖాజీపేట లేక వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకున్న పిదప బస్సు లేక ఆటోల గుండా 5 కి.మీ. దూరంలో నున్న హనుమకొండ నగరానికి చేరుకొని ఆలయ వేళల్లో రుద్రేశ్వర స్వామిని దర్శించవచ్చు. (ప్రస్తుతం ఈ ఆలయంలోని శిల్పకళాశోభితమైన స్థంభాలన్ని విడదీసి పునర్ నిర్మాణముకొరకు ప్రక్కన బెట్టారు)

వరంగల్లు నుంచి షుమారు 7కిలో మీటర్లుంటుంది. అక్కడి వేయి స్తంభాల మంటపం, ఆలయం అధ్బుత శిల్పసంపదతో నిర్మించబడ్డాయి. ఇది 1162లో పాలించిన రుద్రదేవుని కాలంనాటిది. ఇది చాళుక్య శిల్ప సంపదను సంతరించుకున్న స్తంభాలమీద, దర్వాజాల మీద చూడ చక్కని శిల్పాలున్నాయి. ఆనాటి ఆహరవిహారాదులను కళ్ళకు కట్టినట్లు కనిపించే జానపదుల బొమ్మలు, తరులతాగుల్మాదులు స్తంభాల కలంకారములుగా శోభిల్లాయి. పువ్వురేకుల మడతల్లోనించి సన్ననితీగ, లేక దారంకూడా దూర్చి తీయవచ్చు. ఈ ఆలయంలో నంది నల్లరాతిలో సొంపుగ చెక్కబడింది. మెడ పట్టెడలు వగయిరాలు బహుసున్నితంగా చెక్కబడ్డాయి. శిల్పములు ఒక ఎత్తయితే రెండోవంక ఆలయం గర్భ గుడిలోకి డబల్ వాల్ సిస్టములో ఎయిర్ కండిషండ్ చేయబడినట్లు చల్లటిగాలి మాత్రము తగినంత మేరకు వచ్చునట్లు ఏర్పాటు చేయబడింది. ఇదే ఆనాటి నిర్మాణ కౌశల్యానికి మచ్చుతునక. 

వరంగల్లు చేరటానికి హైదరాబాదునుండి వారానికి మూడుమార్లు వాయుదూత్ విమానమార్గముంది. రైలు మీదయితే కాకతీయ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతిరోజూ వుంది. 4గం.ల ప్రయాణం. విజయవాడ నుండి అయితే కాజీపేట దగ్గిర దిగి కొద్ది కి.మీ. దూరంలో వరంగల్లును చూడవచ్చు. హైదరాబాదు, నిజామాబాదుల నుండి మంచి బస్సు సౌకర్యం కూడా వుంది.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...