హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

మంగళవారం, మార్చి 15, 2016

అమరావతి.. అమరలింగేశ్వర స్వామి: గుంటూరు జిల్లా



అమరావతి.. అమరలింగేశ్వర స్వామి: గుంటూరు జిల్లా:

గుంటూరు నుండి 27 కి. మీ వున్న అమరావతికి ప్రతి అరగంటకు బస్సులు తిరుగుతూవుంటాయి. ఇక్కడ ఒకనాడు బౌద్ధులు శివుడు విశ్వవిద్యాలయాలు స్థాపించి, మహొన్నతమైన చరిత్ర సృష్టించారు. విశ్వవిఖ్యాతిని వెలయించారు. ఆనాటి వైభవాలు చిహ్నాలు చరిత్రలో ఈ నాటికి సాక్ష్యం పలుకుతున్నాయి. పంచారామాలయిన అమరారామము, కొమరారామము, భీమారామము, ద్రాక్షారామము, క్షీరారామములలో మొదటిది. పావన కృష్ణా నదీ తీరమున నెలకొనియున్న ఈ క్షేత్రము క్రీస్తు పూర్వ కాలమునుండి సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రముగా పేరుగాంచి యున్నది. ఇక్కడి ప్రాచీన బౌద్ధ స్థూపములు, శిల్పములు లెక్కకు మిక్కుటంగా వుండి పూర్వపు ఔన్నత్యమును చాటుతూ శిల్ప కళా విశేషములను ప్రస్ఫుటిస్తుంది. ఇది శాతవాహనుల కాలం నాటి వరకూ ఒక గొప్ప రాజధాని నగరంగా అభివృద్ధి చెందిన చిహ్నాలు కనబడుతున్నాయి.

క్షేత్ర వైభవం:
ఇక్కడ ముఖ్యంగా చూడదగినది అమరేశ్వరాలయము. వెలసిన దేవుడు అమరేశ్వరస్వామి. దేవేరి రాజ్యలక్ష్మి అమ్మవారు. పంచ ప్రాకారాలు మధ్య ఆలయం ఎత్తుగ నిర్మించబడింది. ఇక్కడ లింగము సుమారు 15 అడుగులు ఎత్తున వుంటుంది. 3 అడుగుల కై వారంతో తెల్లగా వుంటుంది. ఈ లింగమును గూర్చి ఒక వింత ప్రచారంలో ఉంది. ఈ శివలింగము దినదినము పెరుగుతూందనిన్నీ, ఆలయం ఎంత పెంచినప్పటికీ చాలక పోవటంతో ఆలయ నిర్మాతలు లింగము పెరగకుండా నివారించాలనే ఉద్దేశ్యంతో లింగము నెత్తి పై ఒక మేకుని కొట్టారని - అంతటితో పెరుగుదల ఆగిందని సమాచారం. దీన్ని ఋజువు పరస్తున్నట్లుగా - లింగం చాలా ఎత్తుగా ఉండి నెత్తి పైన మేకు - మేకు కొట్టినపుడు స్రవించిన రుధిర ధారల చారలు - గుర్తులున్నాయి. స్వామికి అభిషేకము చేయాలన్నా పైకెక్కి వెళ్ళి చేయాల్సివుంది. 

ఈ అమరావతికి ఒక పురాణ కథ కూడా వుంది. దేవేంద్రుడు అహల్యా జారుడై తత్పాప పరిహారార్ధం ఇక్కడ శివలింగమును ప్రతిష్ఠించాడని దేవతల ప్రభువైన సురేంద్రుని చేత ప్రతిష్టించబడినది గాబట్టి ' అమరావతి ' నామము సార్ధకంగా ప్రసిద్ధమయినది అని అంటారు. 

ఇక్కడ దగ్గరిలోనే దీపాల తిన్నె అనే ప్రదేశం వుంది. బౌద్ధ విగ్రహాలు, స్థూపాలు గలిగిన చోటు. ఇది ఆర్కిలాజికల్ డిపార్టుమెంటు వారు ఆనాటి ఔన్నత్యపు చిహ్నాలను తమ అధీనంలో వుంచుకుని ప్రాచీన కళా సంపదను కాపాడుతూ ఉన్నారు. చరిత్ర అధ్యయన పరులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటాయి.

ఇది శైవ క్షేత్రము. గుంటూరు జిల్లాలొ వున్న అమరావతి పట్టణంలో కృష్ణానది తీరాన వున్నది ఈ ఆలయము. ఈ ఆలయంలో కొలువు దీరిన దేవుడు అమరలింగేశ్వర స్వామి. ఈ శివాలయము ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాలలో ఇది ఒకటి. శ్రీకృష్ణదేవరాయలు అమరావతిని సందర్శించి ఇక్కడి అమరేశ్వరునికి నైవేద్య మహాపూజలు నిర్వహించినట్టు, పెదమద్దూరు గ్రామ పంటభూముల్ని ఆలయానికి దానమిచ్చినట్టుగా ఇక్కడ ఉన్న రాజశాసనం తేటతెల్లం చేస్తోంది. కొండవీటి రెడ్డిరాజులపై విజయానంతరం 1517లో చారిత్రక ప్రాంతం కృష్ణాతీరమైన అమరావతిని దర్శించిన కృష్ణదేవరాయలు ఇక్కడ తులాభారం తూగారు. తన బరువుతో సరిసమానమైన బంగారాన్ని పేదలకు పంచిపెట్టినట్టుగా శాసనంలో ఉంది. అందుకు గుర్తుగా రాయలు నిర్మించిన తులాభార మండపం, దానిముందు వేయించిన శాసనం నేటికీ ఇక్కడ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆలయంలోని దక్షిణ రెండో ప్రాకారంలో ఈ మండపం ఉంది. నేడు అమరావతి అమరేశ్వరునిగా కొలువందు కుంటున్న స్వామి నాడు ధరణికోట అమరేశ్వరస్వామిగా వెలుగొందాడని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. రాయలు తన భార్య చిన్నాదేవి చేత కృష్ణవేణీ తీరాన రత్నధేను మహాదానం, తిరుమల దేవి చేత సప్తసాగర మహాదానం చేయించి నట్టుగా ఇందులో రాసి ఉంది. స్థానికంగా ఉన్న ఇతర విశేషాలు.

అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధాని యైన ధాన్యకటకం. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. బౌద్ధమత చరిత్రలో ధాన్యకటకానిది ప్రముఖ స్థానం. ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకు రాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్ర దుర్గాలలో ఈ నగరమొకటి. సుమారు 16 కి.మీ చుట్టుకొలత కలిగిన మహానగరం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4 - 3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపదం)గా ఉన్నట్టు అధారాలున్నాయి. బుద్ధుని జీవితకాలము నుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగున పడిన చైత్య ప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. దీపాలదిన్నె గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ. అప్పటికే మహాచైత్యం అంతా కూలిపోయి 90 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తుగల ఒక దిబ్బలాగా మిగిలింది. అనేక విడతలుగా జరిగిన తవ్వకాలలో ఎన్నో విలువైన విగ్రహాలు, పరికరాలు మరియు ఇతర వస్తువులు దొరికాయి. ఈ త్రవ్వకాలను సర్ వాల్టర్ స్మిత్ 1845 లో, రాబర్ట్ సీవెల్ 1877 లో, జేమ్స్ బర్గెస్ 1881 లో మరియు అలక్జాండర్ రియ 1888-89 మధ్యలో చేపట్టారు. ఆఖరున జరిగిన తవ్వకాలలో ఈ చైత్య నిర్మాణానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నివసించిన మెగాలిథ్స్ కి సంబంధించిన అవశేషాలు కూడా దొరికాయి. ఇక్కడ దొరికిన శిల్పాలలో ఎక్కువ మద్రాస్ గవర్నమెంట్ మ్యూజియం, చెన్నై మరియు బ్రిటిష్ మ్యూజియం, లండన్ లలో భద్రపరిచారు. ధాన్యకటకంలో 1962-65 మధ్యలో యమ్. వెంకటరామయ్య మరియు కె.రాఘవాచారి ల అధ్వర్యంలో త్రవ్వకాలు జరిగాయి. ఇందులో ఐదు కాలాలకు కి సంబంధించిన అధారాలు దొరికాయి. కార్బన్ డేటింగ్ ద్వారా ఈ పట్టణం క్రీ.పూ.5వ శతాబ్ధికి చెందిందని తెలిసింది.

అద్భుతమైన శిల్పకళతో అలరారే స్థూపంపై బుద్దుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. స్థూపంపై బ్రాహ్మీ లిపిలో శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్థూపం గురించి అప్పటి బ్రిటిషు పురాతత్వ పరిశోధకుడు ఫెర్గుసన్ ఇలా అన్నాడు: "కళావైదుష్యానికి సంబంధించి ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన కట్టడము". దీన్ని చెన్నై లోని ప్రభుత్వ ప్రదర్శనశాలలో భద్రపరచారు.

అఅమరావతికి అతి దగ్గర రైల్వే స్టేషన్ గుంటూరు. అక్కడ నుండి అమరావతికి బస్సు సర్వీసు ఉంది. వర్షాకాలంలో విజయవాడ నుండి లాంచిల ద్వారా కృష్ణానది పై ప్రయాణించి అమరావతి చేరవచ్చు. స్థూపం ఉండిన ప్రదేశం, భారతీయ పురాతత్వ సర్వేక్షణ వారి సంగ్రహాలయము మరియు అమరేశ్వర మందిరం ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...